Magazines

22ఏ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

17 నిమిషాల క్రితం

Special focus on resolving 22 issues
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 3 నిమిషాల చదవడం

భూ రీసర్వేను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి

క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలి

వారంలో మరో 400 రోవర్ల ఏర్పాటు

ఐదు కార్పొరేషన్లలోఇందిరమ్మ టవర్స్‌ : కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో 
మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

రాష్ట్రంలో 22 ఏ భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వే శాఖ అధికారులతో రీసర్వే, హౌసింగ్ అంశాలపై మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించేందుకు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. రీసర్వే, గృహ నిర్మాణం, 22 ఏ భూముల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వేగం, పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలనీ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. రీసర్వే పూర్తయిన తర్వాత భూ యజమానులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలియజేసేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత గ్రామాల్లో చాటింపు నిర్వహించాలనీ, కలెక్టర్లు తప్పనిసరిగా ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని వివరించారు. భూ యజమానులకు ఎలాంటి సందేహాలు, అపోహలు లేకుండా సర్వే ప్రక్రియపై పూర్తి సమాచారాన్ని అందించాలన్నారు.

పాలేరు నియోజకవర్గంలో 141 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు

పాలేరు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని, నియోజకవర్గ పరిధిలోని మొత్తం 141 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు.రాష్ట్రంలో ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న స‌ర్వేకు ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలు, రెండు రోవర్లను సమకూర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 708 రోవర్లతో సర్వే కొనసాగుతోందని, మరో వారం రోజుల్లో అదనంగా 400 రోవర్లను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.

రీసర్వే నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) జారీ చేసిందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఎస్‌ఓపీని సక్రమంగా అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన పద్ధతులు అనుసరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల అనుభవాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఓపీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని అన్నారు. రీసర్వే సమస్యలపై తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సుదీర్ఘ సమీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇటీవల సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించామనీ, ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాలు, నోటీసులు జారీ చేసిన గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను సమీక్షించామని వివరించారు.

రెవెన్యూ–అటవీ భూ సరిహద్దుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి

రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు. ఇరు శాఖల అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిహద్దులను నిర్ధారించాలనీ, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సర్వేలో ప్రతిభ కనబరిచిన నల్లగొండ, ఖమ్మం జిల్లాలను అభినందించారు. నిజామాబాద్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో అర్హులైన పేదలకు త్వరితగతిన లబ్ధి చేకూర్చాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, హన్మకొండ జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను తక్షణమే గుర్తించి, సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. డబుల్‌ ‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉన్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి డిఎస్‌ లోకేశ్‌ కుమార్, గృహ‌నిర్మాణ శాఖ కార్య‌ద‌ర్శి విపి గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్