హక్కుల కోసం ఉద్యమం..ప్రజాస్వామ్య రక్షణే లక్ష్యంగా పోరాటం
‘ఆక్యుపై ఢిల్లీ’కి సన్నద్ధం
ప్రభుత్వాలపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి
నేడు, రేపు మల్టీపుల్ డేస్ నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేడు, రేపు (25,26 తేదీల్లో) సమస్త రంగాల కార్మికులు ఒక్కటై హైదరాబాద్‌లోని దర్నా చౌక్‌లో నిరసన తెలపనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ధిక్కారాన్ని ప్రకటించనున్నారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ‘మల్టీపుల్డేస్ ధర్నా’కు అన్ని రంగాలు సన్నద్దమ వుతున్నాయి.‘పొద్దస్తమానం కష్టపడుతున్నాం.. రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. అయినా తమ కష్టాలు కడతే రటం లేదు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం’ అంటూ కార్మికులు కండ్లెర్ర జేస్తున్నారు.
న్యాయం కావాలి..
కార్మికులు తమకు న్యాయం కావాలని కోరుతున్నారు.. రాజ్యాంగ బద్ద హక్కులను హరించొద్దని వేడుకుంటున్నారు. ఎంతో కొంత ఉపయోగంగా ఉన్న చట్టాలను సవరించి నాలుగు లేబర్‌కోడ్‌లుగా ఎందుకు తీసుకొచ్చారని మోడీ సర్కార్‌ను నిలదీస్తున్నారు. ఇందులో కార్మికుల మంచి కంటే.. కార్పొరేట్ల ప్రయోజనమే దాగుందని చెబుతున్నారు. అయినా పాలకులు పట్టించుకోవటం లేదు. విన్నపాలు, శాంతియుత నిరసనలు, ప్రజాస్వామ్యబద్ద ఆందోళనలు ఆ నినాదాల వెనుక కార్మికుల ఆవేదనలు మోడీ సర్కార్ చెవికెక్కకపోవటం బాధాకరం. అందుకే కాబోలు ఓకడుగు ముందుకేసి, ప్రభుత్వాలపై కార్మికులు సమరశీల పోరాటాలకు సై అంటున్నారు.
యజమానుల లాభాల కోసం..
కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని మోడీ సర్కార్ పాతరేసింది. ‘ఎక్కువ కష్టపడి, ఎక్కువ లాభాలు కంపెనీ యజమానులకు తెచ్చిపెట్టాలి’. ఇది మోడీ ఉవాచ. వారి పట్ల ఆ సర్కారుకున్న అభిమానం అది. అందుకే లాభాలకు ఆటంకంగా లేని విధంగా చట్టాలను సవరించాలనుకున్నది. ఎన్నో పోరాటాల ఫలితంగా సంభవించిన హక్కులు, చట్టాలు ఒక్క కలం పోటుతో నాలుగు కార్మిక కోడ్లుగా మార్చింది..హక్కులకు పంగనా మాలు పెట్టింది. కార్మికుల కష్టాన్ని మరింత సౌలభ్యంగా యజమానుల గల్లా పెట్టెల్లోకి మళ్లించింది.
ప్రయివేటుకే జై..
పబ్లిక్ రంగానికి జైకోట్టాల్సిన ప్రభుత్వం, ప్రయివేటు రంగానికి సై అంటుంది. కార్పొరేట్ కంపెనీ యజమానులను కౌగిలించుకుంటోంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని ఏదో ఒక నెపంతో నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఉన్నది. అందులో భాగంగానే వాటాలు విక్రయిస్తున్నది. విదేశీ పెట్టుబడులకు ఎర్రతివాచాలు పరిచి ఆహ్వానిస్తున్నది. ఒకప్పుడు ఆయా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉద్యోగాలకు భద్రత ఉండేది. నేడు ఆ పరిస్థితి మారింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉద్యోగుల స్థితి ఉన్నది. మరో పక్క ఫిక్స్డ్ టర్మ్, కాంట్రాక్ట్, క్యాజివల్, ట్రైనీస్, అంప్రంటీస్, నాన్ పర్మినెంట్ క్యాటగిరీలను ప్రొత్సహిస్తున్నది. ఈ కోవలో పని చేస్తున్న వారికి కార్మిక చట్టాలు వర్తించవు.
స్కీం వర్కర్ల పట్ల నిర్లక్ష్యం..
స్కీం వర్కర్ల కృషికి అవార్డులిస్తున్నారు. పొగడ్తలు కురిపిస్తున్నారు. వారి త్యాగాలను మెచ్చుకుంటున్నారు.అయినప్పటికీ స్కీమ్ కార్మికులకు పనికి తగిన పరిహారాన్ని చెల్లించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయి. తమ శాఖల్లోని పర్మినెంట్ ఉద్యోగులతో సమానమైన కాలానికి పని చేస్తున్నప్పటికీ వారికిస్తున్న వేతనాలు ఇప్పటికీ గొర్రె తోక బెత్తెడుగానే ఉన్నాయి. ఈ పథకాలకు వేటికీ చట్టపరమైన మద్దతు లేదు. ఇస్తున్నది గౌరవ వేతనం కాబట్టి, మిమ్ముల్ని కార్మికులుగా గుర్తించబోమంటున్నాయి. కనీస వేతనాలు, పీఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ వంటి సౌకర్యాలు తాము కల్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. స్కీమ్‌లలో పనిచేస్తున్న వారు అనేక రకాలుగా ఉన్నారు. వీరిలో ప్రత్యేకించి గౌరవ వేతనం మీద పనిచేస్తున్న కార్మికులు అందరి కంటే ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వీఓఏ, ఆర్పీలు వీరిలో ప్రధానమైనవారు.
శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాల్సిందే..
చుక్క రాములు, అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర కమిటీ
శ్రమకు తగ్గ ఫలితం పొందాల్సిందే.. ఇది ఎవరో ఇచ్చే బిక్షం కాదు..హక్కు అని కార్మికుడు గుర్తించాలి. కష్టం మనది, లాభం వారికా? పౌష్టికాహారం లేక రోగాలు, రొప్పులతో బాధపడేది మనమైతే..సకల సౌకర్యాలతో, విలాస జీవితాలు వారి వంతా? ఇట్లా ఎంత కాలమని ఉపేక్షించాలి. కార్మికవర్గం తెగువను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ తరహా పోరాటాలు దేశంలో ఇప్పటికే పలు రూపాల్లో జరుగుతున్నాయి. ఆ వెలుగులో సమరశీల పోరాటాలకు పదునుపెడదాం. ఈ నెల 25,26 మహాధర్నాకు కదులుదాం.
పోరాటమే ఏకైక మార్గం
పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాలకులు ఎప్పుడూ యజమానులు యజమానుల పక్షమే ఉంటారు. అది వారి వర్గ స్వభావం. కార్మికులు ఐక్యమై తమ హక్కులను రక్షించేకునేందుకు, సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. అందుకే జీతం, బత్తేం కోసమే కాదు..హక్కుల కోసం నినదించాలి. ప్రజాస్వామ్య రక్షణకోసం పోరాడాలి. మెరుగైన జీవన విధానం కోసం సంఘటితమవ్వాలి. ఈ నేపథ్యంలో ‘మల్టీపుల్ డేస్ నిరసన, అక్యుఫై ఢిల్లీ ’..అందుకు కార్మిక వర్గం సన్నద్ధం కావాలని విజ్ఞప్తి
మాటలే..చేతల్లేవ్..
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తప్పు పడుతున్నట్టు మాటల్లో చెబుతుంది. ఆచరణలో మాత్రం ఆ చట్టాల అమలుకు పూనుకుంటున్నది. కార్మిక కోడ్లను అమలు చేసేందుకు చాపకింది నీరులా పావులు కదుపుతున్నది. ముసాయిదా నోట్ తయారు చేసింది. ఆ కోడ్లను అమలు చేయటం, చేయకపోవటం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ.. మోడీ బాటలో వాటిని అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నది. కార్మిక కోడ్లలో పనిగంటల పెంపు ప్రధానమైన అంశంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పనిగంటల పెంపునకు అవకాశం కల్పిస్తూ ఏకంగా జీవోనే తీసుకొచ్చి, కార్పొరేట్ల కండ్లు చల్లబర్చింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లెస్మెంట్ యాక్ట్ ద్వారా యజమానులు కార్మికులతో ఇష్టమొచ్చిన రీతిలో పనిచేయిం చుకునేందుకు అవకాశం కల్పించింది.







కామెంట్లు (0)