Magazines

భర్తే బంధించి..

1 గంట క్రితం

Sexual assault
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

మయన్మార్‌ ‌మహిళపై అతని స్నేహితుల లైంగికదాడి

కంచన్‌బాగ్‌లో దారుణ ఘటన

నవతెలంగాణ–చార్మినార్‌

భర్తే ఇంటికి బయట నుంచి తాళం వేసి బంధించి వెళ్లిపోగా, అతడి ముగ్గురు స్నేహితులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మయన్మార్‌కు చెందిన 18 ఏండ్ల వివాహిత ఆరోపించింది. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మహమ్మద్‌ ఫయాజ్‌ అరెస్టుపై స్పష్టత లేదు.

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్‌‌కు చెందిన యువతి బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌లో నివసిస్తున్న సమయంలో మహమ్మద్‌ ఫయాజ్‌ పరిచయమయ్యాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన ఫయాజ్‌.. ఈ ఏడాది మే నెలలో ఆమె కుటుంబసభ్యులకు తెలియకుండా హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అనంతరం ఖాజీ ద్వారా వారికి వివాహం జరిగింది. ఆ దంపతులు హఫీజ్‌బాబా నగర్‌లోని క్యాంపు నంబర్‌ 21 ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. కొంతకాలానికి ఫయాజ్‌ తనకు పరిచయమైన ముగ్గురు వ్యక్తులను ఇంట్లో ఉండేందుకు తీసుకొచ్చాడు. భార్యను ఇంట్లో ఉంచి ఫయాజ్‌ తాళం వేసి బయటకు వెళ్లాక అతడి సహచరులు ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించారు.

​ఇంటి యజమాని రాకతో వెలుగులోకి..

23న రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి యజమాని అద్దె వసూలు చేసేందుకు అక్కడికి వచ్చాడు. బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించి తాళం పగులగొట్టడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం బాధితురాలు తన కుటుంబ సభ్యులను సంప్రదించగా, వారు ఆమెను బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో నివసించే బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్టోబర్ 26న ఆమెను కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.

​ముగ్గురి అరెస్ట్‌.. ఫయాజ్‌పై స్పష్టత ఏది?

ఈ ఘటనపై క్రైమ్‌ నంబర్‌ 295/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 64(2)(m), 127(4), 351 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. అయితే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మహమ్మద్‌ ఫయాజ్‌ను అరెస్టు చేశారా? లేదా? అతడు పరారీలో ఉన్నాడా? అనే వివరాలను స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై కంచన్‌బాగ్‌ పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్