Magazines

సాగర్‌లో మళ్లీ జల జగడం

1 గంట క్రితం

Sagar
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

అనుమతుల్లేకుండానే 
కుడి కాలువకు ఏపీ నీటి విడుదల

వెంటనే ఎడమ కాలువకూ గేట్లు తెరిచిన తెలంగాణ అధికారులు

చోద్యం చూస్తున్న కృష్ణానది యాజమాన్య బోర్డు


నవతెలంగాణ - నాగార్జునసాగర్
సాగర్ జలాల విడుదల విషయంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన గురువారం జల జగడం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్ అధికారులు కుడి కాలువకు నీరు విడుదల చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రాంత ఇరిగేషన్ అధికారులు సైతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. అసలే ఎల్‌‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటి పోతుంటే ఇరు రాష్ట్రాలు ఎవరికి వారే నీటి విడుదల చేసుకుంటుండటంతో భవిష్యత్‌ పరిస్థితులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సమాచారమూ లేకుండా నాగార్జునసాగర్‌‌లో ఆంధ్రప్రదేశ్ భాగాన ఎలాంటి అనుమతులూ తీసుకోకుండా ఆ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్ పేరున భారీగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ క్రమంలో కృష్ణానది యాజమాన్య బోర్డు చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం సాగర్ జలాశయంలో 176 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కనీస నీటిమట్టం 510 అడుగులకు చేరుకుంటే 45 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనిలో 5 టీఎంసీల మేరకు నీరు ఆవిరి కింద పోగా సుమారు 40.5 టీఎంసీల నీరు ఇరువు రాష్ట్రాలు పంపకాలు చేసుకోవాల్సి ఉంది. నవంబర్ 23వ తేదీన ఈ నీటి పంపిణీ, వినియోగం విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్ర, తెలంగాణ ఈఎన్‌‌సీలతో త్రిసభ్య సమావేశం ఏర్పాటు చేసింది. ఆంధ్ర ప్రభుత్వం కోరినట్టుగా కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయగా సమావేశం వాయిదా పడింది. ఈ నీటి పంపకాల విషయంలో మరోసారి సమావేశం ఏర్పాటు కాకముందే ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు కేఆర్‌ఎంబీ నుంచి ఎటువంటి ఉత్తర్వులూ, సమాచారం లేకుండానే గురువారం కుడి కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సైతం ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేశారు.


ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 533.90 అడుగుల నీటిమట్టం ఉండగా గురువారం సాయంత్రానికి సాగర్ జలాశయానికి 5,663 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడి కాలువ ద్వారా 6,324 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3,549 క్యూసెక్కులు, ఎస్ ఎల్ బి సి ద్వారా 2,000 క్యూసెక్కులు మొత్తంగా 11,873 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ​ఆంధ్ర, తెలంగాణ అధికారుల వివరణలు కుడి కాలువ పరిధిలో తాగునీటి అవసరాల నిమిత్తం సుమారు 8 టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ కుడి కాలువ పరిధిలోని సాగర్ ఎస్ఈ రమేష్ తెలిపారు. ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు ఎటువంటి అనుమతులూ లేకుండా నీటి విడుదల చేసుకోవడంతో తెలంగాణ ఇరిగేషన్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎడమ కాలువకు కూడా నీరు విడుదల ప్రారంభించినట్టు సాగర్ డ్యాం తెలంగాణ ఎస్‌ఈ మల్లికార్జునరావు చెప్పారు. ఎడమ కాలువ పరిధిలోని పెద్దదేవుల పల్లి, పాలేరు రిజర్వాయర్లను తాగు నీటి కోసం నింపడానికి ఈ నీటిని వినియోగించనున్న‌ట్టు గా తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నీటి విడుదల కొనసాగుతుందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్