రెండు కోట్ల డాలర్లు
కేటాయింపు
ఇప్పటికే పాతిక లక్షల
డాలర్ల సొమ్ము చెల్లింపు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇంద్రుడు...చంద్రుడు అని పొగుడుతూ విడుదల చేస్తున్న ప్రకటనల కోసం ఇప్పటికే లక్షలాది డాలర్ల పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చు చేశారు. ప్రముఖ రాజకీయ యాడ్ - ట్రాకింగ్ సంస్థ ‘యాడ్ ఇంపాక్ట్’ అంచనా ప్రకారం ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తే ప్రకటనల నిమిత్తం ఇరవై మిలియన్ డాలర్లు కేటాయించారు. టీవీలలో మూడు వేర్వేరు ప్రకటనల ప్రసార సమయాల కోసం ఇప్పటి వరకూ రెండున్నర మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఈ విధంగా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ ప్రకటనల కోసం ఖర్చు చేయడం చట్టవిరుద్ధమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ట్యాక్స్ పేయర్ల సొమ్ముతో జరుగుతున్న ప్రకటనల ప్రచారానికి అయ్యే అసలు ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిని నిర్ధారించడం కష్టం.
వారం రోజులలో వేలాది ప్రకటనలు
ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే పబ్లిక్ సిటిజన్ అనే సంస్థ కూడా ఈ ప్రకటనల ప్రహసనంపై మండిపడింది. పన్ను చెల్లింపు దారుల సొమ్మును ప్రచారానికి ఉపయోగించ డాన్ని ఫెడరల్ చట్టం నిషేధిస్తోందని గుర్తు చేసింది. కేటాయింపులకు సంబంధించిన నిబంధ నలను, హ్యాచ్ చట్టాన్ని ఉల్లంఘించి ట్రంప్‌కు అనుకూలంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించింది. ప్రతినిధులసభ, సెనెట్‌లోని డెమొక్రాట్లు ఈ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ రిపబ్లికన్లు మాత్రం ఇంకా స్పందించడం లేదు. ఈ నెల 23 - 29 తేదీల మధ్య 2,766 సార్లు ప్రకటనలు ప్రసారమయ్యాయని సీఎనఎన్ వార్తా సంస్థ తెలియజేసింది. ఇవి ఫాక్స్ న్యూస్‌తో పాటు నాలుగు ప్రధాన ప్రసార నెట్‌వర్క్‌లలో ప్రసారమయ్యాయి. ప్రకటనల కోసం చేసిన ఖర్చులో 30 శాతాన్ని ఎన్ఎఫ్ఎల్, కాలేజ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం కేటాయించారు. ఏబీసీకి చెందిన ‘ది వ్యూ’, సీబీయస్కు చెందిన ‘ఎల్స్‌బెత్’, ఎన్బీసీకి చెందిన ‘ద వీకెస్ట్ లింక్’ వంటి కార్యక్రమాల ప్రసార సమయాలలో కూడా ఈ ప్రకటనలు కన్పించాయి.
ఈ ప్రకటనలను ‘ప్రజా సేవా ప్రకటనలు’గా వర్గీకరించడంతో వీటికి సంబంధించిన కచ్చితమైన ఖర్చు వివరాలు బహిర్గతం కాలేదు. ‘లవ్ మీ’ అనే పాటతో కూడిన ట్రంప్ మొదటి ప్రకటన ఇప్పటి వరకూ 1,300 సార్లు ప్రసారమైంది.
ఏం జరిగిందంటే...
ట్రంప్‌ను పొగుడుతూ విడుదల చేస్తున్న ప్రకటనలకు అయ్యే డబ్బు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) నుంచి వస్తుంది. సీబీపీ అనేది హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ పరిధిలోని ఓ ఏజెన్సీ. ఈ నెల ప్రారంభంలో అధ్యక్షభవనానికి చెందిన మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయం ‘ఓబీబీబీఏ కార్యక్రమాల’ కోసం సీబీపీకి 20 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఓబీబీబీఏ అనేది ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. దీనిపై గత సంవత్సరం ట్రంప్ సంతకం చేశారు. తనకు నిధులు కేటాయించిన కొద్దిసేపటికే జాతీయ మీడియా ప్రచారం కోసం ఎల్ఎండీ ఏజెన్సీ అనే ప్రకటనల సంస్థతో సీబీపీ ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రకటనలు జాతీయ మీడియాలో ప్రసారం కావడం మొదలైంది. కాగా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అవినీతిమయం చేస్తున్నారని ఇద్దరు డెమొక్రటిక్ సెనెటర్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఓ లేఖ రాశారు.
ట్యాక్స్ పేయర్ల సొమ్ముతో ట్రంప్ ప్రకటనలు
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)