Magazines

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

51 నిమిషాల క్రితం

It is the BRS government that will come to power.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం


మరోసారి సీఎం కానున్న కేసీఆర్‌ :
ఇండియా టుడే సదస్సులో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేరళంలోని కొచ్చిలో బుధవారం నిర్వహించిన ఇండియా టుడే సదస్సులో ఆయన ప్రసంగించారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. గత 26 ఏండ్లలో బీజేపీతో బీఆర్‌ఎస్ ఒక్కసారి కూడా పొత్తు పెట్టుకోలేదని, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తుచేశారు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్‌ఎస్ బీజేపీకి వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటామని కేటీఆర్ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం ఉండగా, ప్రస్తుతం 19 శాతానికి తగ్గిందని తెలిపారు. పార్లమెంట్ సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ స్థానాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మద్దతు ఇస్తామని చెప్పారు. అస్సాం, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లు పెంచినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలపై తమకు నమ్మకం లేదని కొట్టిపారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ తెలిపారు. 2023 ఎన్నికల్లో 420కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిలో ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్-రీకాల్ (వెనక్కి పిలవడం), రిగ్రెట్ (తప్పు చేశామనే భావన), రివోల్డ్ (తిరుగుబాటు)’ పరిస్థితి కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు పునరాలోచిస్తున్నారని, ఈ అసంతృప్తి తిరుగుబాటు దిశగా మారుతోందని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఢిల్లీ నాయకత్వానికి విధేయత చూపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రాముడు-శివుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ, బీజేపీ మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలనుకుంటే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేవుళ్ల ప్రాతిపదికన విభజిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదేనా రెండు జాతీయ పార్టీల ఎజెండా అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన, హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. 2022 నాటికే ప్రతి ఇంటికీ మంచినీరు, బుల్లెట్ రైళ్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి లక్ష్యాలు సాధించాల్సి ఉండగా, వాటి పరిస్థితి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించకుండా యూసీసీ, వందేమాతరం వంటి అంశాలపై దృష్టి పెట్టడం ఎందుకని అన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారిందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంఘంలో జరుగుతున్న పరిణామాలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయడం అవసరమేనని, అయితే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని సర్ ప్రక్రియపై వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ గెలిచిన 39 నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారని ఆరోపించారు. సర్ పై నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు. జెన్‌జీ ఉద్యమాలపై స్పందించిన కేటీఆర్.. దేశంలో యువత ఉద్యమించడం కొత్తేమీ కాదని, తెలంగాణ ఉద్యమం కూడా అదే తరహాలో సాగిందని అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై యువత, ముఖ్యంగా జెన్‌జీ తీవ్ర ఆగ్రహంతో ఉందని చెప్పారు. సమస్యలపై యువత ప్రశ్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం యువత ప్రశ్నిస్తుంటే పట్టించుకోవడం లేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగాలపై సమాధానం ఇవ్వకుండా దృష్టి మళ్లించడం సరికాదని, ఇంకెంతకాలం మతం పేరుతో దేశాన్ని విభజిస్తారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్