Magazines

‌రాజస్తాన్‌‌తో విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలి

1 గంట క్రితం

The power agreement with Rajasthan must be cancelled.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 3 నిమిషాల చదవడం

జైపూర్‌‌లో ఉత్పత్తి అయ్యే కరెంటు వంద శాతం తెలంగాణకే
యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం కేంద్రాల్లో బొగ్గు కొరత లేకుండా చూడాలి
కరెంటు లేక ఇబ్బందిపడుతుంటే ఇతర రాష్ట్రాలకు ఎలా ధారాదత్తం చేస్తారు : సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్తాన్‌కు కట్టబెట్టే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం ఆయన బహిరంగలేఖ రాశారు. సొంత రాష్ట్రంలో రైతులు కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటే ఇతర రాష్ట్రాలకు కరెంటును ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరెంటు లేక రైతుల పంటలు కళ్లెదుటే ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని పేర్కొన్నారు. తెలంగాణలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయడం ప్రజా వ్యతిరేక చర్య కాక మరేమిటని ప్రశ్నించారు. బొగ్గు, నీళ్లు, స్థలం ఇక్కడివేననీ, జైపూర్ (సింగరేణి)లో తయారయ్యే 800 మెగావాట్ల కరెంటు మాత్రం రాజస్థాన్‌కా? అని తెలిపారు. సొంత రాష్ట్రంలో కరెంటు ఇవ్వలేక రాజస్తాన్‌కు విద్యుత్‌ను కట్టబెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణి నుంచి దాదాపు రూ.22 వేల కోట్ల పెట్టుబడిని రాజస్తాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కనీసం ఏడు–ఎనిమిది గంటలు కూడా ఇవ్వలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని తెలిపారు. విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలు ప్రకటిస్తూ పాలనా వైఫల్యాన్ని ఎల్‌నినో మీదకు నెట్టి తప్పించుకుంటారా?అని ప్రశ్నించారు.

నాసిరకం బొగ్గును వాడుతున్న ప్రభుత్వం
యాదాద్రి ప్లాంటుకు జీ 10, జీ 11 గ్రేడ్ బొగ్గు వాడాలనీ, నాసిరకం జీ 13, జీ 14 బొగ్గు వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారని హరీశ్‌‌రావు విమర్శించారు. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి కొత్తగూడెం 800 మెగావాట్లు, భద్రాద్రి 540 మెగావాట్ల కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపేశారని తెలిపారు. థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కాదు కదా, కనీస నిల్వలు కూడా లేకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా ఎన్‌టీపీసీ ఇచ్చే 1,600 మెగావాట్ల కరెంటును వద్దు అని చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎవరని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

డిమాండ్లు
రాజస్తాన్‌తో చేసుకున్న విద్యుత్ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి.
జైపూర్‌లో ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను వంద శాతం తెలంగాణే వినియోగించుకునేలా రాష్ట్ర డిస్కంలతోనే ఒప్పందం చేసుకోవాలి.
యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం కేంద్రాల్లో బొగ్గు కొరత లేకుండా పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని రైతులు, ప్రజల కరెంటు కష్టాలను తీర్చాలి.


నటుడు ప్రియదర్శికి హరీశ్ రావు అభినందన

ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి బుధవారం హైదరాబాద్‌‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌రావు‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో తెలంగాణ సాధనలో చూశామని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ఇటీవల వచ్చిన ప్యారడైజ్ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించార‌నీ, ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి జీవించారని ఆయన కొనియాడారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమనీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు. ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు. ప్యారడైజ్ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యాసకు, పల్లె కథలకు ప్రియదర్శి కేరాఫ్ అడ్రస్‌గా మారారని హరీశ్‌రావు అన్నారు. గతంలో వచ్చిన 'మల్లేశం' సినిమా ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలను, 'బలగం' సినిమాతో పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను ప్రపంచానికి అద్భుతంగా చాటిచెప్పారని గుర్తుచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి తన స్వయంకృషితో మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడిగా ప్రియదర్శి ఎదగడం తెలంగాణకే గర్వకారణమని హరీశ్‌‌రావు అన్నారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆయన భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు.మాజీ మంత్రి హరీశ్‌రావు‌కు నటుడు ప్రియదర్శి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పాటు పడే నాయకుడిగా పేరు సంపాదించడం వెనుక ఎంతో కృషి దాగి ఉందని తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్