Magazines

సైబర్‌ నేరాల్లో 60 శాతం పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ మోసాలే

1 గంట క్రితం

Investment and stock market scams account for 60% of cybercrimes.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రజలు కోల్పోయిన రూ.455 కోట్లను రికవరీ చేసిన సైబర్‌ పోలీసులు
“ఏదైనా చేసే ముందు ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి”
తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణలో సైబర్‌ మోసాల కారణంగా ప్రజలు కోల్పోతున్న మొత్తంలో దాదాపు 60 శాతం స్టాక్‌ ట్రేడింగ్‌, బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కు సంబంధించిన వేనని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్‌ తెలిపారు. రెండేండ్లలో సైబర్‌ మోసాల్లో ప్రజలు కోల్పోయిన రూ.455 కోట్లను సైబర్‌ పోలీసులు రికవరీ చేసినట్టు వెల్లడించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లోని హోటల్‌ అవాసాలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌, తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌ పోలీసుల సహకారంతో హైదరాబాద్‌ ప్రీమియం నాలెడ్జ్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో “కన్వర్సేషన్‌ ఆన్‌ సైబర్‌ సెక్యూరిటీ–వెన్‌ ట్రస్ట్‌ బికమ్స్‌ ది వెపన్‌” పేరుతో సింపోజియం నిర్వహించారు. కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిఖా గోయల్‌ మాట్లాడారు. సైబర్‌ నేరగాళ్లు ప్రజల నమ్మకం, భయం, అత్యాశ, ఆతురత, ఇతరులుగా నటించడం వంటి మానసిక అంశాలను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వియత్నాం, మయన్మార్‌, కంబోడియా వంటి దేశాల నుంచి కూడా అధునాతన సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. “ఏదైనా చేసే ముందు ఆగండి.. ఆలోచించండి.. ధ్రువీకరించండి” అని సూచించారు. సైబర్‌ లా నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్‌ పవన్‌ దుగ్గల్‌ మాట్లాడుతూ ప్రతి పనికీ ఏఐపై ఆధారపడటం వల్ల మానవ ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ, డీప్‌ఫేక్‌లపై ప్రత్యేక చట్టాలు అవసరమని పేర్కొన్నారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని అంతిమ సత్యంగా భావించకుండా మానవ, న్యాయపరమైన పర్యవేక్షణ కొనసాగాలని అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు జితెన్‌ జైన్‌ మాట్లాడుతూ మొబైల్‌ నంబర్‌ను సున్నితమైన వ్యక్తిగత సమాచారంగా పరిగణించాలని సూచించారు. అవసరం లేకుండా షాపింగ్‌, బిల్లింగ్‌ సమయంలో ఫోన్‌ నంబర్‌ ఇవ్వకూడదని చెప్పారు. ఎథికల్‌ హ్యాకర్‌ శుభాంక్‌ సింఘాయ్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్ల ప్రధాన లక్ష్యం డబ్బుతో పాటు బాధితుల నమ్మకం కూడా కావచ్చని పేర్కొన్నారు. సింపోజియంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో రూపొందించిన సైబర్‌ అవగాహన వీడియోలు, క్రియేటివ్‌లను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని సుమారు 2.95 లక్షల మంది పెన్షనర్లు, 3 లక్షలకు పైగా ఉద్యోగులకు సైబర్‌ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్