నవతెలంగాణ - అశ్వారావుపేట
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బచ్చువారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రేగడిగుంపు కు చెందిన మడివి నంద (35), కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 28న గ్రామస్తులు కొత్తల పండుగ నిర్వహించగా, నంద ఇంటి వద్దే మద్యం సేవించి మేకలు, గొడ్లను కాయడానికి వెళ్లలేదు.
అదే రోజు కూలీ పనికి వెళ్లిన అతని భార్య మడివి లక్కీ సాయంత్రం సుమారు 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి నందను మందలించింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంటి వద్ద గుర్తుతెలియని కలుపు మందు తాగాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈనెల 29 న రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందాడు.
మృతుడికి భార్యతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య మడివి లక్కీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)