Magazines

బాలికకు రక్షణ కరువు

51 నిమిషాల క్రితం

Girls Lack Protection
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 4 నిమిషాల చదవడం

నాలుగు రెట్లు పెరిగిన లైంగికదాడులు

దేశంలో న్యాయం మాత్రం నత్తనడకే

2015లో 10,934 మంది బాలికలు.. 2024లో 
43,675 మంది

2024లో 
శిక్ష పడింది 
30 శాతం కేసుల్లోనే

86 శాతం కేసులు ఇంకా పెండింగ్‌లోనే

97 శాతం ఘటనల్లో నిందితులు బాలికలకు తెలిసినవారే

ఎన్సీఆర్బీ గణాంకాల్లో 
షాకింగ్‌ నిజాలు


దేశంలో బాలికల రక్షణ కోసం కఠిన చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నా పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో 18 ఏండ్లలోపు బాలికలపై నమోదైన లైంగికదాడి కేసులు దశాబ్ద కాలంలో దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు కోర్టుల్లో కేసుల పెండెన్సీ భారీగా కొనసాగుతోంది. దీంతో చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదనీ, వాటి అమలు, దర్యాప్తు, వేగవంతమైన విచారణ, బాధితులకు రక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


న్యూఢిల్లీ : దేశంలో బాలికలపై లైంగిక హింస తీవ్రతను జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు మరోసారి వెల్లడిస్తున్నాయి. 2015లో 18 ఏండ్లలోపు బాలికల్లో లైంగికదాడి బాధితుల సంఖ్య 10,934గా ఉండగా.. 2024 నాటికి అది 43,675కు చేరింది. అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. కేసుల నమోదు పెరగడానికి అవగాహన, ఫిర్యాదుల నమోదు మెరుగుపడటం వంటి కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నప్పటికీ.. బాలికల భద్రత విషయంలో దేశం ఎదుర్కొంటున్న సవాలు మాత్రం తీవ్రమైనదేనని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

దశాబ్దంలో నాలుగు రెట్లు
18 ఏండ్లలోపు బాలికలపై నమోదైన లైంగికదాడి ఘటనలు సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చాయి. 2015లో 10,934గా ఉన్న బాధితుల సంఖ్య 2024లో 43,675కు చేరింది. అంటే పది సంవత్సరాల్లో దాదాపు నాలుగు రెట్లు పెరుగుదల నమోదైంది. అయితే కేవలం కేసుల సంఖ్య పెరిగిందని చెప్పడం ద్వారా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోలేమనీ, గతంతో పోలిస్తే బాధితులు పోలీసులను ఆశ్రయించడం, నేరాలను నమోదు చేయడం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ బాలికలపై లైంగిక నేరాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.


లైంగికదాడులే అత్యధికం
2020 నుంచి 2024 మధ్య కాలంలో బాలికలపై లైంగికదాడికి సంబంధించిన 1.83 లక్షల మంది బాధితులు నమోదయ్యారు. ఇదే కాలంలో దాదాపు లైంగిక దాడులకు సమానమైన దారుణాలకు బాధితులైన బాలికల సంఖ్య 96,505గా ఉంది. ఇక లైంగిక వేధింపుల కేసుల్లో 12,807 మంది, పిల్లలను అశ్లీల ప్రయోజనాలకు ఉపయోగించిన కేసుల్లో 2,924 మంది బాధితులుగా నమోదయ్యారు. ఈ గణాంకాల్లో లైంగికదాడి కేసులే అధికంగా ఉన్నాయి. బాలలపై లైంగిక నేరాలను నియంత్రించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉన్నప్పటికీ.. కేసుల సంఖ్య గణనీయంగా ఉండటం దాని అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


బాధితుల్లో టీనేజ్ బాలికలే ఎక్కువ
బాధితుల వయసును పరిశీలిస్తే మరో ఆందోళనకరమైన విషయం బయటపడుతోంది. 2020-24 మధ్య 16 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న బాలికలపై లైంగికదాడులు జరిగి 94,503 కేసులు నమోదయ్యాయి. 12 నుంచి 16 ఏండ్ల మధ్య వయసున్న బాధిత బాలికలపై దారుణాలు జరగగా.. 70,442 కేసులు రిజిస్టరయ్యాయి. అంటే మొత్తం బాధితుల్లో అత్యధిక భాగం కౌమార దశలో ఉన్న బాలికలే కావడం ఆందోళన కలిగించే విషయం. పాఠశాలలు, కళాశాలలు, కుటుంబాలు, సామాజిక వ్యవస్థతో పాటు పోలీసు, న్యాయ వ్యవస్థలు ఈ వయసు బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గణాంకాలు సూచిస్తున్నాయని మేధావులు చెప్తున్నారు.


నిందితులు పరాయివారు కాదు
బాలికలపై లైంగికదాడుల విషయంలో మరో షాకింగ్‌ అంశం వెలుగులోకి వచ్చింది. 2024లో నమోదైన బాలికల లైంగికదాడి కేసుల్లో 97 శాతం ఘటనల్లో నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని గణాంకాలు చెప్తున్నాయి. స్నేహితులు, వివాహం చేసుకుంటానని నమ్మించిన వ్యక్తులు, బంధువులు, పొరుగువారు, కుటుంబ సభ్యులు వంటి పరిచయస్తులు నిందితులుగా ఉన్న కేసులు అధికంగా ఉన్నాయి. గత ఎన్సీఆర్బీ గణాంకాల్లోనూ లైంగికదాడి కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసినవారే అధికంగా ఉన్నట్టు నమోదైంది. అంటే బాలికలకు ప్రమాదం ఎప్పుడూ బయట నుంచి మాత్రమే రావడం లేదు.. కుటుంబం, బంధుత్వం, పరిచయాల పరిధిలోనే నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా కనపిస్తోంది. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని బాలికల పట్ల రక్షణ చర్యలను కూడా అదే స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉందని మేధావులు, సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.


కేసులు పెరుగుతున్నా.. తీర్పులు ఎక్కడ?
దేశంలో బాలికలపై దారుణాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నప్పటికీ.. న్యాయ ప్రక్రియ వేగం మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు. 2024లో బాలికలపై లైంగికదాడి కేసుల్లో శిక్షల శాతం సుమారు 30 శాతంగా ఉండగా.. 86 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు, ఫాస్ట్‌ట్రాక్ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇంత భారీగా కేసులు పెండింగ్‌లో ఉండటం బాధిత కుటుంబాలకు తీవ్రమైన సమస్యగా మారుతోంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, ఛార్జ్‌షీట్, సాక్ష్యాల నమోదు, విచారణ, తీర్పు వరకు ప్రతి దశలోనూ ఆలస్యం జరిగితే న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలపై మరింత భారం పడుతోంది.


చట్టాలు మాత్రమే సరిపోవు
బాలల రక్షణ కోసం దేశంలో పోక్సో వంటి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. లైంగిదాడి, బాలలపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోనూ మహిళలు, బాలలపై లైంగిక నేరాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అయితే కఠిన చట్టం ఉండటం ఒక భాగమే. నేరం జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు, నిష్పక్షపాత దర్యాప్తు, ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణ, బాధిత బాలికకు మానసిక, న్యాయ సహాయం, సాక్షుల రక్షణ, వేగవంతమైన విచారణ, సమయానుకూల తీర్పు... ఇవన్నీ సమర్థంగా పనిచేసినప్పుడే చట్టం ఉద్దేశం నెరవేరుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా బాలలపై లైంగికదాడి కేసుల్లో పోలీసుల వ్యవహారశైలి, బాధిత బాలల పట్ల సున్నితత్వం వంటి అంశాలపై తీవ్రంగా స్పందించిన సందర్భాలూ ఉన్నాయి. 2026లో నాలుగేండ్ల బాలికపై లైంగికదాడి కేసులో దర్యాప్తు, పోలీసుల స్పందనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.


భద్రతకు భరోసా ఎప్పుడు?
‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి నినాదాలతో బాలికల విద్య, భద్రత, సాధికారతపై దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రచారం చేసుకుంటున్నది. అయితే ఈ నేపథ్యంలో వారి భద్రత విషయంలో ఈ గణాంకాలు మరిన్ని ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. బాలికలు పాఠశాలకు వెళ్లడం, ఉన్నత విద్య అభ్యసించడం, ఉద్యోగాల్లోకి రావడం ఎంత ముఖ్యమో.. వారు భయంలేకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం కూడా అంతే ముఖ్యం. బాలికల భద్రతను కేవలం నినాదాలుగా కాకుండా పోలీసింగ్, న్యాయవ్యవస్థ, విద్యాసంస్థలు, కుటుంబాలు, సామాజిక వ్యవస్థలో ఆచరణాత్మక చర్యగా మార్చినప్పుడే పరిస్థితిలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్