Magazines

ఐక్యత చాటిన తెలంగాణ

46 నిమిషాల క్రితం

డీజీపీ సీవీ ఆనంద్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రశాంతంగా గణేశ్‌ నిమజ్జనం
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ పోర్టల్‌లో 
1.24 లక్షల విగ్రహాలు నమోదు : డీజీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఐక్యతను చాటి చెప్పారని గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఇప్పటివరకు జరిగిన నిమజ్జనాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గణేష్‌ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు. గతేడాది 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని, ఈసారి సంఖ్య పెరిగిందన్నారు. ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహాల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్లు, ఇండ్లు, వ్యక్తిగత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలిపితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.5 నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 88 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని తెలిపారు. ఇంకా మిగతా విగ్రహాలు శనివారం ఉదయానికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. మతపరమైన అంశాలను గౌరవిస్తూ నగరంలో శోభాయాత్రలు మధ్యాహ్నం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయని వివరించారు. దీంతో నిమజ్జనాలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో నిమజ్జనాల కోసం గత పది రోజులుగా సుమారు 25 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీజీఎస్‌పీ, ఆర్‌ఏఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆక్టోపస్‌ బలగాలను మోహరించినట్లు డీజీపీ తెలిపారు. డీజీపి రిజర్వ్‌ నుంచి ఐదు కంపెనీలను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో భారీగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. క్రేన్లు, ఇతర అత్యవసర సేవలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, హైదరాబాద్‌ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌ తదితరులతో ఏరియల్‌ సర్వే ద్వారా కూడా పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. గణేష్‌ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎస్సై వెంకన్న మృతి బాధాకరమన్నారు. సైబరాబాద్‌ పరిధిలోని పటాన్‌చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఖైరతాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒకరు మృతి చెందగా, నిర్మల్‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మొత్తం 26 మంది ప్రమాదాల్లో గాయపడగా, మల్కాజిగిరిలో 17 మంది గాయపడినట్లు తెలిపారు. ప్రజలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో మిగిలిన విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం ఉదయం 10.30 గంటలలోపు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ నిమజ్జనాలు దాదాపు పూర్తయ్యాయని, నల్లగొండ, నిర్మల్‌ తదితర ప్రాంతాల్లో కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణను పోలీసులు ఆరు దశలుగా విభజించుకున్నారని తెలిపారు. అందులో చివరి దశగా ప్రతి ఒక్కరూ నిమజ్జనం పూర్తిచేసుకుని సురక్షితంగా ఇంటికి చేరేవరకు పోలీసుల విధులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే అన్ని మతాల ప్రజలు సమైక్యంగా, సోదరభావంతో జీవించే ప్రాంతమన్నారు. గణేష్‌ నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడం ప్రజల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. భైంసాలో ముస్లిం సోదరులు ‘హిందూ–ముస్లిం భాయ్‌భాయ్‌’ అంటూ గణేష్‌ ఉత్సవాల్లో పాల్గొనడం దీనికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
పోలీసులకు సహకరించండి
నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను ఆలస్యం చేయకుండా, పోలీసుల సూచనలకు అనుగుణంగా త్వరగా తరలించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతోపాటు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్