Magazines

విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలి

1 గంట క్రితం

హరే కృష్ణ ఫౌండేషన్
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం
​సీఎంను కలిసిన హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ బడిలో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో హరే కృష్ణ ఫౌండేషన్, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారన్నారు. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ ను తయారు చేయాలని సూచించారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇదనీ, అత్యంత జాగ్రత్త వహించాలని చెప్పారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి కావాలని ఆదేశించారు. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభం చేయాలన్నారు. సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.​ కాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తోపాటు జున్నా సోలార్ సిస్టమ్స్ ‌ప్రయివేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఆ సంస్థలు సహకారం అందించనున్నాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు అందించారు. వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం మరో రూ. 4 కోట్ల చెక్కును చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ అందించారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్