రైతు సంఘం జాతీయ మహాసభను జయప్రదం చేయాలి : ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు
జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడలో కార్మికులతో సమావేశం
నవతెలంగాణ- మిర్యాలగూడటౌన్
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కార్మిక, కర్షక ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత 36వ రైతు మహాసభను విజయవంతం చేయడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం కోసం శుక్రవారం మిర్యాలగూడలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో రంగారెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. నల్లగొండ గడ్డ అనేక రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని, అదే పోరాట స్ఫూర్తితో ప్రస్తుతం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడంతో పాటు, రైతాంగ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునేందుకు అఖిల భారత రైతు మహాసభ వేదికగా నిలుస్తుందని తెలిపారు.
రైతుల సమస్యలు కేవలం రైతులకే పరిమితమైనవి కాదని, వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమాలను నిర్మించగలమన్నారు. మహాసభ ప్రచారాన్ని గ్రామగ్రామాన, కార్మిక ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలని, కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం కోసం విరాళాలు, ప్రచారం, ఇతర కార్యక్రమాల్లో కార్మికులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రవి నాయక్, రైల్వే హమాలి యూనియన్ నాయకులు నంద్యాల వేణుధర్ రెడ్డి, బధ్యానాయక్ ధనావత్ భాగ్య నాయక్, బాణావతి రెడ్య నాయక్, అజమీరా హుష్యా, బాలు పాల్గొన్నారు.
కార్మిక, కర్షక ఐక్యతను బలోపేతం చేయాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)