శివరాంపల్లిలో విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు దుద్దిళ, తుమ్మల
నాణ్యత విషయంలో రాజీ పదొడ్దు
తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలి
ఆయిల్ పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యం :
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విజయ బ్రాండ్‌పై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాలనీ, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విజయ బ్రాండ్‌లను తెలంగాణ కే పరిమితం చేయకుండా దేశమంతటా విస్తరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని, మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. విజయ వంట నూనెల విక్రయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో ప్రారంభమైన విజయ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం నేడు రోజుకు 200 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి ఎదగడం గర్వకారణమన్నారు. విజయ ఆయిల్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రయివేటు ఆయిల్ బ్రాండ్ల ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను సరసమైన ధరలకు అందించడంతో పాటు ధరల స్థిరీకరణ లక్ష్యంతో విజయ ఆయిల్ ప్యాకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం వేరుశనగ, పొద్దుదిరుగుడు, రైస్ బ్రాన్, నువ్వుల, దీపం, కొబ్బరి తదితర ఆరు రకాల వంట నూనెలను వినియోగదారులకు అందిస్తు న్నామ్నారు. శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో, పరిశుభ్రమైన, హైజెనిక్ వాతావరణంలో వంట నూనెలను ప్యాకింగ్ చేసేలా రూపొందించామని చెప్పారు. మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌లోకి విజయ అడుగుపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట అయినందున రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించే విధంగా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. ఆయిల్‌పామ్ దిగుమతులపై విధిస్తున్న దిగుమతి సుంకం విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని మరోమారు కోరారు. రబీ సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. వర్షపు నీటిని ఫామ్‌పాండ్లలోకి మళ్లించడం ద్వారా భూగర్భ జలాల రీచార్జ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు నీటి సంరక్షణ చర్యలను చేపట్టి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని కొనసాగించాలని సూచించారు. కార్య క్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఆయిల్ ఫెడ్ ఎమ్‌డీ యాస్మిన్ బాషా, రిటైర్డ్ ఐపీఎస్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విజయ బ్రాండ్‌పై నమ్మకాన్ని పెంచాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)