ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలి :మహేశ్ కుమార్ డిమాండ్
టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,
మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్, వివేక్ తదితరులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయత పరిరక్షణకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి బీఆర్కే భవన్ లోని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన సందర్భంగా భాగంగా జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ర్యాలీ అనంతరం మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహమ్మద్ అజహరుద్దీన్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో ఎన్నికల సంఘం పనితీరు, నిర్ణయాలు తీసుకునే విధానం, సర్ ప్రక్రియపై వెలువడుతున్న అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన మీడియా నివేదికల ప్రకారం, సుమారు పది నెలల వ్యవధిలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి 14 సందర్భాల్లో అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేశారని తెలిపారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు–పునరుద్ధరణ, సర్ ప్రక్రియలోని కొన్ని నిర్ణయాలు, ఎన్నికల డేటా నిర్వహణ తదితర అంశాలకు ఈ అభ్యంతరాలు సంబంధించినవని చెప్పారు. సర్ ప్రక్రియలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని విమర్శించారు.
ఇవి ముసాయిదా ఓటర్ల జాబితాల్లో జరిగిన తొలగింపులేనని, క్లెయిమ్‌లు, అభ్యంత రాలు, పేర్ల పునరుద్ధరణకు చట్టబద్ధమైన ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంటున్నప్పటికీ దీనిపై స్వతంత్ర పరిశీలన అవసరమని అభిప్రాయపడ్డారు. ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాల అంశంపై మరింత స్పష్టత అవసరమని తెలిపారు. సర్ కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని, అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని ఎన్నికల సంఘం పేర్కొన్న నేపథ్యంలో, సంబంధిత రికార్డులు, నిర్ణయ ప్రక్రియపై ప్రజలకు మరింత పారదర్శకత కల్పిం చాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుచేశారు. దాని విశ్వసనీయత స్వతంత్రత, పారదర్శకత, సమిష్టి నిర్ణయ ప్రక్రియ, అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ కూటమి, పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలవకుండా ఓట్ల తొలగింపుతో బీజేపీని గెలిపించారని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలి :
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపు
రాహుల్ గాంధీ హెచ్చరించినట్టుగానే ఓట్ల చోరీ నిజమని తేలిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నిరసన ర్యాలీ సందర్భంగా రాజ్యాంగం పుస్తకంలో ఆయన ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్న తీరును ఎన్నికల సంఘంలోని కమిషనర్లే అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన దురదృష్టకర పరిణామమని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఉందని చాటారు. ఓటు హక్కును కాపాడేందుకు మొదట్నుంచి పోరాడుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కమిషనర్లు ఒప్పుకోవాల్సి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఓటు హక్కునే కాలరాస్తే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్నారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు మాత్రమే ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. భారత ప్రజాస్వామ్యంపై, పౌరుల హక్కులపై కాంగ్రెస్‌కు సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన, ప్రతీ పౌరుడికీ వారి ఓటు హక్కు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా ఆరు డిమాండ్లు నెరవేర్చాలని కోరింది
. ''ఎన్నికల సంఘం పనితీరు, ప్రజా విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రశ్నించినట్టు నివేదించబడిన నిర్ణయాలకు సంబంధిం చిన సమావేశాల మినిట్స్, ఉత్తర్వులు, నోట్లు, అభ్యం తరాలు, సంబంధిత రికార్డులను చట్టపరంగా అనుమతిం చబడిన మేరకు ప్రజల ముందుంచాలి. సర్ ప్రక్రియలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించబడినట్టు వచ్చిన నివేదికలపై స్వతంత్ర, పారదర్శక సమగ్ర పరిశీలన జరపాలి. అర్హత కలిగిన ఓటర్లు పొరపాటున తొలగించబడ్డారా అనే అంశాన్ని కూడా పరిశీలించాలి. సర్ కింద తొలగించబడిన పేర్లకు సంబంధించి రాష్ట్రాల వారీగా, నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలు, తొలగింపునకు కారణాలు, క్లెయిమ్‌లు–అభ్యంతరాల అనంతరం పునరుద్ధరించబడిన పేర్ల సంఖ్యను ఎన్నికల సంఘం వెల్లడించాలి. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నమోదు చేసినట్టు నివేదించబడిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రజా వివరణ ఇవ్వడంతో పాటు, తుది నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా అభ్యంతరాలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకున్నారో వెల్లడించాలి. పరిపాలనా పొరపాటు, తగిన ధ్రువీకరణ లేకపోవడం, సరైన నోటీసు అందకపోవడం లేదా విధానపరమైన లోపాల కారణంగా అర్హత కలిగిన ఏ పౌరుడూ ఓటు హక్కును కోల్పోకుండా పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టాలి... '' అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నిరసన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల నాయకులు, కార్పొరేషన్ల చైర్మెన్లు, సికింద్రాబాద్, హైదరాబాద్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)