వైద్యుల నిర్లక్ష్యంగానే మృతి చెందారని
కుటుంబ సభ్యుల ఆందోళన
గతంలోనూ ఇలాంటి ఘటనలు
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరు శిశు సంక్షేమ ఆస్పత్రిలో కాన్పు కోసం వస్తున్న గర్భిణులు మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన వైద్యం అందకే గర్భిణులు, నవజాత శిశువులు మృతి చెందుతున్నట్టు సమాచారం. ఇలాంటి ఘటననే బుధవారం కూడా చోటుచేసుకుంది. ప్రసవం అనంతరం బాలింతతోపాటు శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డ మృతిచెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తికి చెందిన బాలమణి(25)కి కర్నాటకలోని సెడేం సమీపంలోని అనంతపూర్‌కు చెందిన రాజుతో గతేడాది వివాహం జరిగింది. మొదటి కాన్పు కోసం బాలమణిని తల్లిదండ్రులు బాలప్ప, గోవిందమ్మ వారి కూతురు బాలమణి బుధవారం ఉదయం 9 గంటలకు మాతా శిశు ఆస్పత్రిలో మొదటి కాన్పు కోసం చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా.. ఆడబిడ్డ జన్మించింది. అయితే రెండు గంటల తర్వాత తల్లితో సహా బిడ్డ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లీబిడ్డ మృతిచెందడంతో బోరున విలపించారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, యాలాల ఎస్‌ఐ విటల్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ జావీద్ ఆస్పత్రికి చేరుకొని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆస్ప్రతిలో నిత్యం మరణాలు కొనసాగుతున్నాయని కౌన్సిలర్ జావీద్, కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. బాలింత శిశువు మృతికి కారణమైన వైద్యులపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తాండూరు ఎంసీహెచ్ లో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సంబంధిత వైద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనే ఈ ఆస్పత్రిలో వైద్యం అందక బాలింతలు, గర్భిణులు మృతిచెందిన ఘటనలు ఉన్నాయి.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి :
సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్
తాండూర్ పట్టణ కేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణులు, నవజాత శిష్యులు మృతి చెందుతున్నారని సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ప్రతిసారీ ఏదో ఒక విచారణ పేరుతో మభ్య పెట్టి దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆస్పత్రికి పేద ప్రజలు వస్తారని, వారికి తగిన వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వంతోపాటు ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.






కామెంట్‌లు (0)