Magazines

హైదరాబాద్‌ లో 
శరవేగంగా అభివృద్ధి

56 నిమిషాల క్రితం

Rapid development in Hyderabad
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 3 నిమిషాల చదవడం

జంటనగరాల్లో రూ. 52 వేల కోట్ల పనులు

భవిష్యత్‌కు అనుగుణంగా
 మౌలిక వసతుల విస్తరణ
ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయం, 
మెట్రో ప్రాజెక్టులు మావే :
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌‌ 
ప్రారంభోత్సవం 

‎నేడు మంత్రుల మెట్రో, 
ఆర్టీసీ బస్సు ప్రయాణం


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ ‎
ప్రజా పాలనలో భాగంగా హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.52 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, తాగునీటి వసతులు తదితర రంగాల్లో భారీగా పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని వివరించారు. ‎హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ–మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన పౌర సదుపాయాలను ఇప్పటి నుంచే విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ‎ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా పనులు చేసి వాటి ఫలితాలను ప్రజలకు చూపించాలనే విధానంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.35 వేల కోట్లతో రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిల వంటి భారీ మౌలిక వసతుల పనులు చేపట్టామని తెలిపారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌, వాటర్‌ వర్క్స్‌, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి పనులతో కలిపి నగరంలో మొత్తం రూ.52 వేల కోట్ల విలువైన పనులు చేపట్టామని స్పష్టం చేశారు. ‎హైదరాబాద్‌ అభివృద్ధిలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాత్రను ప్రస్తావిస్తూ నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి, మంజీరా జలాలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తీసుకొచ్చాయని  తెలియజేశారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం నగరానికి ఒక్క చుక్క అదనపు తాగునీటిని కూడా తీసుకురాలేదని విమ ర్శించారు. ‎గండిపేట నీటిని నిజాం పాలనలోనే తీసుకొచ్చారనీ, ఆ తర్వాత హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా, మంజీరా, గోదావరి జలా లను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయని చెప్పారు.‎ ‎హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయని తెలిపారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యాసంస్థలతో పాటు బీహెచ్‌ఈఎల్‌, ఈసీఐఎల్‌, డీఆర్‌‌డీవో, బీడీఎల్‌, మిధాని, ఐడీపీఎల్‌ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అప్పటి కాంగ్రెస్‌ పాలనలోనే ఏర్పాటయ్యాయని చెప్పారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. ‎హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు మెట్రో రైల్‌ను 122 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్టు తెలిపారు. ఓల్డ్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, పటాన్‌చెరు, హయత్‌నగర్‌ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు రూ.38 వేల కోట్లతో ఫేజ్‌–2 ప్రాజెక్టును చేపట్టనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధిని నగర పరిధి దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.

362 కిలోమీటర్ల మేర అన్ని జిల్లాలను అనుసంధానించే ఈ ప్రాజెక్టుకు రూ.30,627 కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసంధానిస్తూ 21 రేడియల్‌ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 10 రోడ్ల అలైన్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చామనీ, రెండు రోడ్ల పనులు ప్రారంభమ య్యాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి కీలకమైన మూసీ నది పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భట్టి చెప్పారు. సుమారు 55–56 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీన నదిని ప్రక్షాళన చేసి, నగరానికి మెరుగైన పర్యావరణ వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫేజ్‌–1 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్‌ ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని భట్టి తెలిపారు. ఇప్పటికే 550 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయనీ, మరో 2,200 బస్సులను భవిష్యత్తులో వస్తాయన్నారు. ఆటో డ్రైవర్లు డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చుకునేందుకు రెట్రోఫిట్టింగ్‌ కోసం రూ.200 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో హైదరాబాద్‌ మరింత నివాసయోగ్యమైన నగరంగా మారుతున్నదనీ, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.


‎‎ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ ప్రారంభం ‎
నగర ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఆర్టీసీ, మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌ విధానాన్ని ప్రారంభించడం అభినందనీయమని భట్టి అన్నారు. ఒక రోజు నుంచి నెల రోజుల పాస్‌ వరకు రెండు రవాణా వ్యవస్థల్లోనూ ఉపయోగిం చుకునేలా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు. తాను, రాష్ట్ర మంత్రులంతా రూ.500 చెల్లించి ఒకరోజు పాస్‌లు కొనుగోలు చేశామని చెప్పారు. శనివారం ఉదయం బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి మెట్రోలో ప్రయాణించి, అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ కామన్‌ పాస్‌ సౌకర్యాన్ని స్వయంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అజారుద్దీన్‌,  ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, మహేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు  తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్