మనుషులను చంపగలరేమో కానీ
ఆశయాలను చంపలేరన్నగొప్ప వ్యక్తి
మతం వ్యక్తిగతం..రాజకీయాలు వేరు :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
కూకట్‌పల్లిలో
భగత్‌సింగ్ 119వ జయంతి
నవతెలంగాణ–కూకట్‌పల్లి
భగత్‌సింగ్ ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి బస్టాప్ వద్ద సోమవారం భగత్‌సింగ్ 119వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్ చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరని భగత్‌సింగ్ తన త్యాగంతో చాటిచెప్పారని తెలిపారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛా కాంక్షను రగిలించి, స్వరాజ్య సాధన కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన యోధుడని కొనియాడారు. ఆయన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆలోచనలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయ న్నారు. మూఢనమ్మకాలు, అంటరానితనం, మతతత్వం, సామాజిక అసమానతలను భగత్‌సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలని, మతం వ్యక్తిగత విషయమని భగత్‌సింగ్ స్పష్టం చేశారని చెప్పారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు రాజకీయంగా కలిసి పనిచేయాలంటే లౌకిక దృక్పథం అవసరమని ఆయన నొక్కిచెప్పారన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో మతతత్వ నాయకులు, కొన్ని పత్రికల పాత్రను కూడా భగత్‌సింగ్ విమర్శించారని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం, సంకుచిత భావాలను తొలగించడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం పత్రికల బాధ్యతగా ఆయన భావించారని చెప్పారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం భగత్‌సింగ్ అనేక రచనలు చేశారని, సామాజిక వివక్షను తీవ్రంగా ప్రశ్నించారని అన్నారు. ‘నేను నాస్తికుడిని ఎందుకయ్యాను’ వంటి రచనల్లో తన హేతుబద్ధమైన వైఖరి, భౌతికవాద అవగాహన, మార్క్సిస్టు దృక్పథాన్ని వివరించారని అన్నారు. భారతదేశంలో సమసమాజం, సోషలిస్టు రాజ్యం ఏర్పడాలని ఆకాంక్షించారన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. నేడు వివిధ సామాజిక, రాజకీయ వర్గాలు భగత్‌సింగ్ పేరును తమకు అనుగుణంగా మలుచుకుంటున్నాయని విమర్శించారు. ఆయన అసలు ఆశయాలు, రచనలు, ఆలోచనలను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మత వివక్ష, మూఢనమ్మకాలు, మతోన్మాదం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతోపాటు ఎన్నికల సంఘం పనితీరుపైనా విమర్శలు చేశారు. సర్ పేరుతో 13 కోట్ల మంది ఓట్లను తొలగిస్తున్నారని వివరించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘
నవతెలంగాణ’ ప్రజల గొంతుక
ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు కొండలరావును సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ‘నవతెలంగాణ’ దినపత్రిక చందాదారుగా చేర్పించారు. ప్రజల గొంతుకగా ‘నవతెలంగాణ’ నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు. కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత సమస్యలపై నిరంతరం గళం వినిపిస్తోందని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమానత్వం కోసం నిలబడుతోందన్నారు. ‘చదవండి.. చదివించండి.. చందాదారులుగా చేరండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కూకట్‌పల్లి మండల కార్యదర్శి ఎం.శంకర్, సీపీఐ నాయకులు కొండలరావు, వెంకటరెడ్డి, నాగరాజు, డీవైఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీనునాయక్, నాయకులు పల్లి ధర్మారావు, కృష్ణారావు, లక్ష్మీనారాయణ, భీమేశ్వరరావు, పరమేష్, వేణుబాబు, వి.శివప్రసాద్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)