Magazines

తండ్రీకొడుకుల గడీలు బద్దలు కొడతాం

3 గంటల క్రితం

bonds of father and son
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 4 నిమిషాల చదవడం

కేసీఆర్‌ కుటుంబ అక్రమార్జన లెక్కలు తేల్చుతాం

కాళేశ్వరం రూ.లక్ష కోట్ల దోపిడీ.. మానేరులో ఇసుక దొంగల పనిపడతాం

రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లపై అసెంబ్లీలో విచారణ

దళితులంటే ‌మాజీ సీఎంకు చులకన.. అందుకే అసెంబ్లీకి రావడం లేదు
వచ్చేనాటికి గజ్వేల్‌, సిరిసిల్ల గడ్డపై ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే!

వైఎస్సార్‌-డీఎస్‌ జోడీలాగే రేవంత్‌-మహేశ్‌ జోడీతో మళ్లీ అధికారంలోకి వస్తాం

సిరిసిల్లను ‘ఉరిసిల్ల’గా మార్చిన బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌తోనే నేతన్నలకు ఊరట : రాజన్న సిరిసిల్ల జిల్లా 'ప్రజా ఆశీర్వాద' భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి

అంతకుముందు కరీంనగర్‌ ‌కలెక్టరేట్‌ ‌భవనం ప్రారంభం


నవతెలంగాణ - కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/రాజన్నసిరిసిల్ల
‘కేసీఆర్‌, కేటీఆర్‌కు నిలయాలైన గజ్వేల్‌, సిరిసిల్ల గడీలను బద్దలు కొట్టి కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం.. కేసీఆర్‌ కుటుంబం సాగించిన వేల కోట్ల దోపిడీ అక్రమాల చిట్టాను శాసనసభ వేదికగా పార్ట్‌-2 కింద బట్టబయలు చేసి ‘చెడుగుడు’ ఆడుకుంటాం. కాళేశ్వరం రూ.లక్ష కోట్ల దోపిడీ.. మానేరులో ఆ కుటుంబ ఇసుక దొంగల పని పడతాం. ప్రజలు ప్రతిపక్షహోదా ఇస్తే.. దళితుడు స్పీకర్‌గా ఉంటే సహించలేని కేసీఆర్‌.. అసెంబ్లీ గేటులోకి రావడం లేదు. పైగా దళిత స్పీకర్‌నే ‌తట్టి.. ఇదేంటని అడిగేందుకు వెళితే పసుపునీళ్లతో తన కొంపను కడిగిన వైనాన్ని ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్క దళితుడూ జీర్ణించుకోవడం లేదు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ దుర్మార్గపు పాలనను బొందపెట్టిన మేము.. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి- డీ.శ్రీనివాస్‌ (వైఎస్సార్‌ - డీఎస్‌) జోడీ నేతృత్వంలో (మొదటిపేజీ తరువాయి) కాంగ్రెస్‌ వరుసగా అధికారంలోకి వచ్చినట్టే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కాంబినేషన్‌లో రాష్ట్రంలో ‘ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌ రావడం ఖాయం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం కరీంనగర్‌ కొత్త కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని రూ.347కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘హోటళ్లలో చిప్పలు కడిగిన కేటీఆర్‌కు కాంగ్రెస్‌ గురించి మాట్లాడే అర్హత లేదు. గజ్వేల్‌, సిరిసిల్లలో ఫైరింగ్‌ తుపాకులు లాంటి కాంగ్రెస్‌ కార్యకర్తలే కేసీఆర్‌, కేటీఆర్‌ గడీలను బద్దలు కొడతారు. రాబోయే రోజుల్లో సిరిసిల్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేసి ఈ ప్రాంత బిడ్డను గెలిపిస్తే అతనికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం. అలాగే శాసనమండలికి ఇక్కడి నుంచి ఒక పద్మశాలీ బిడ్డను పంపిస్తాం’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.


అసెంబ్లీలో పార్ట్‌-2 కింద కేసీఆర్‌ కుటుంబ ఆస్తుల చిట్టా..
దుబాయ్‌ బ్రోకర్‌గా ఉన్న కేసీఆర్‌కు, అమెరికాలో బాత్‌రూమ్‌లు, హోటళ్లలో చిప్పలు కడిగిన కేటీఆర్‌కు రూ. లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో తేలుస్తామ‌ని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. జన్వాడ, శంకర్‌‌పల్లి, మొయినాబాద్‌, ఎర్రవల్లిలోని కేటీఆర్‌, ఆయన చెల్లె కవిత, బావ హరీశ్‌రావు, తండ్రి కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌‌ల లెక్కలన్నీ బయటకు తీస్తామని తెలిపారు. హైటెక్‌ సిటీ వద్ద ‘దక్కన్‌ సిరాయ్‌’ పక్కన 400 గదులతో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, ఎట్‌ హోమ్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్ల వివరాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. అమెరికా, సింగపూర్‌లో కేటీఆర్‌ పెట్టిన పెట్టుబడుల ఆధారాలు సేకరిస్తున్నామని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్ట్‌-2 కింద వీరి అక్రమాలపై ప్రశ్నించి ‘చెడుగుడు’ ఆడుకుంటామని హెచ్చరించారు. మానేరు వాగులో ఇసుకను కొల్లగొట్టి కేసీఆర్‌ బావమరిది రవీందర్‌రావు, ఈయన కొడుకు సంతోష్‌రావు వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఇసుక దోపిడీని అడ్డుకున్న నేరెళ్ల దళితులపై లారీలు ఎక్కించి, పోలీసులతో దారుణంగా చావ బాదించారని గుర్తుచేశారు. మిడ్‌ మానేరు ముంపులో ఆస్తులు పోయాయని తెల్లరేషన్‌ కార్డులు చూపి సంతోష్‌రావు పునరావాస స్థలాలు కూడా కొట్టేసి ఆగర్భ ధనికుడిగా మారాడన్నారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులతో జోడీ కట్టి వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ఆ తర్వాత తన కుటుంబంతో సహా తన సామాజిక తరగతి వారినే పదవుల్లో కూర్చోబెట్టుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చి మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిందన్నారు. తన పెండ్లి జరిగిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్‌, అణా పైసా కూడా ఇవ్వకుండా రాజన్నతో పాటు భద్రాచలం రామయ్యకు శఠగోపం పెట్టారని ఆరోపించారు.


సిరిసిల్లను ‘ఉరి’సిల్లగా మార్చిన బీఆర్‌ఎస్‌
సిరిసిల్ల చేనేత కార్మికుల నైపుణ్యం ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత ఇక్కడి నేతన్నలదని సీఎం కొనియాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్ల ‘ఉరి’సిల్లగా మారిందని, కార్మికుల ఆత్మహత్యలు, గల్ఫ్‌ వలసలు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేకే మహేందర్‌రెడ్డి పార్టీని ముందుకు నడిపితే, సడెన్‌గా కేటీఆర్‌కు టికెట్‌ ఇచ్చి 172 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిపించుకున్నారని గుర్తుచేశారు. ఆరు పర్యాయాలు సిరిసిల్ల ప్రజల ఓట్లతో గెలిచి కేటీఆర్‌ వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారే తప్ప, నేత కార్మికుల బతుకులు మార్చలేకపోయారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి రెండున్నరేండ్లలో రూ.1,731 కోట్లు ఖర్చు చేశామని, ఇక్కడి నేతన్నలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బకాయి పడ్డ రూ.350 కోట్లను చెల్లించడంతో పాటు, ఇందిరమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చామని వివరించారు. గడీల పాలన కావాలో.. పేదల సంక్షేమం చూసే ప్రజాపాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, మహ్మద్‌ అజహారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమరణరావు, మక్కాన్‌సింగ్‌ ఠాకూర్‌, పార్లమెంట్‌ సభ్యులు వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.​


అభివృద్ధి కోసం కేంద్రంతో ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణి

కరీంనగర్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ‘ఇచ్చిపుచ్చుకునే ధోరణి’తో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పునరుద్ఘాటించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు సాధించకపోతే ఆశించిన ప్రయోజనం దక్కదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలుస్తామని తెలిపారు. కానీ కొందరు తాము ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నామంటూ పర్యటనలను లెక్కలేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి విషయంలో సమన్వయంతో సాగాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 170 ఎకరాల రక్షణ శాఖ (డిఫెన్స్‌) భూములను రాష్ట్ర ప్రగతి కోసం బదలాయించేలా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు. బేగంపేట రన్‌వే కింద నుంచి రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలోనే కరీంనగర్‌ జిల్లా సమగ్ర అభివృద్ధిపై మరోసారి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్