Magazines

ఆహ్లాదకర ప్రేమకథా చిత్రం

53 నిమిషాల క్రితం

romantic film
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఏమో ఏమో ఇది’. యువతను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమాను భూతిని అందించేందుకు సినిమా సిద్ధమవుతోంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రచయిత, దర్శకుడు శైలేష్ కొలను తొలిసారి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తనదైన థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాతో పూర్తిగా భిన్నమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌ల ఫ్రెష్ పెయిర్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ' ఏమో ఏమో ఇది’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వీడియో సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు, చిత్రంలోని ప్రేమకథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచింది. తాజాగా ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని పాటలతో పాటు ఇతర ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్