నవతెలంగాణ-హైదరాబాద్: జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపడుతున్న వందలాది మంది విద్యార్థులు, యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఖండించింది. ఆందోళనను అణిచివేసేందుకు యత్నించిన మోడీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండిస్తూ పొలిట్‌బ్యూరో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో విద్యార్థి సంఘాలు సహా పలువురు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని, సీఈసీ జ్ఞానేష్‌కుమార్ బీజేపీ ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన ఒక ‘అంతర్గత విభాగం (బ్యాక్ ఆఫీస్)’గా మార్చారని మండిపడింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్న ఢిల్లీ పోలీసులు నగరం మొత్తాన్ని కోటలాగా దిగ్భందించి, జంతర్‌మంతర్ వైపు వెళ్లేవారినందరినీ అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
జంతర్‌మంతర్‌లో ఎటువంటి సమావేశానికైనా అనుమతిని నిరాకరించడం ద్వారా, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని పేర్కొంది. పోలీసులు అడ్డుకునేందుకు అన్ని విధాలా యత్నించినప్పటికీ.. వారి దౌర్జన్యాన్ని, బారికేడ్లను ఎదుర్కొని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) సహా పలు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకి చెందిన వందలాది మంది యువత నిరసన ప్రాంతానికి చేరుకున్నారని పేర్కొంది.
ఆందోళనకారులను పోలీసులు క్రూరంగా హింసించడమే కాకుండా బస్సుల్లోకి నెట్టిపడేశారని, దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టిందనేది వాస్తవమని పేర్కొంది.
ఆందోళనలో పాల్గొన్న సీపీఐ(ఎం)ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబి, సీనియర్ నేత బృందాకారత్, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు ఎఎ.రహీమ్, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు ఆదర్శ్ ఎం. సాజి, ఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షులు, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శి ఐషీఘోష్ సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులు తీవ్రంగా అణిచివేయబడుతున్నాయని పొలిట్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళల కోసం కేటాయించిన ప్రత్యేక వేదిక అయిన జంతర్‌మంతర్‌లో సైతం నిరసనలకు అనుమతినివ్వకపోవడంతో నిరసన ప్రదర్శనల పట్ల ఈ ప్రభుత్వం ఎంత అసహనంగా మారిందో అర్థమౌతోందని తెలిపింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని, ధైర్యంగా పెద్ద సంఖ్యలో ఆందోళనలో భాగస్వామ్యమయ్యేందుకు వచ్చిన యువతకు ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో అభినంవదనలు తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఇసిఐ వంటి ప్రభుత్వ సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించడం కొసం ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొంది. ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుండి తక్షణమే తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను అడ్డుకోవాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)