Magazines

మేకపోతు గాంభీర్యం

15 నిమిషాల క్రితం

bravado
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 3 నిమిషాల చదవడం

పెద్దాయన నిద్ర లేచాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. పొద్దునే దినపత్రికలు చదవటం లాంటి అలవాట్లు లేవు. పైగా ఆ అవసరం కూడా కలగలేదు. అన్ని దినపత్రికలు తనకు అనుకూలంగా రాసేవే! టీవీ ఛానళ్లు కూడా పెద్దగా చూసే అవసరం లేదు. అవీ అంతే! అందుకే తనకిష్టమైన మశ్రూమ్స్ తింటూ ఆలోచించసాగాడు. అమెరికా ఎన్నికల ఫలితాలు తనకు తీవ్రమైన నిరాశ కలిగించాయి. తనకే ఇంతగా నిరాశ కలిగిస్తే తన ఆప్తమిత్రుడు ట్రంప్‌నకు ఎంత నిరాశ కలిగిందో అనుకున్నాడు. తన మరో ఆప్తమిత్రుడి పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు! ఇజ్రాయిల్‌‌లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు ఓడిపోయాడు! ఆప్త మిత్రులిద్దరూ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినటం పెద్దాయనకు ఏదో దుశ్శకునంలా కనబడింది! కాని పెద్దాయన దాన్ని పట్టించుకోలేదు! ఇలాంటి దుశ్శకునాలెన్నో తట్టుకుని నిలబడ్డ గుండె కదా!

కరోనాలో గంగానదిలో శవాలు కుప్పలు తెప్పలుగా కొట్టుకుని వస్తేనే స్పందించలేదు! పెద్దాయన ఫోను తీశాడు. ట్రంప్‌నకు, నెతన్యాహూకి కాన్ఫరెన్సు కాల్ కలిపాడు. ఓటమి బాధలో ఉన్న మిత్రులను ఓదార్చటం పదవిలో వున్న బాధ్యత అనుకున్నాడు. తీరా ఫోన్ కలిశాక కాని అర్థం కాలేదు. తాను చేసిన పొరబాటేమిటి? నెతన్యాహు ఏదో మాట్లాడుతున్నాడు! అతడు మాట్లాడేదేమిటో అర్థం చేసుకునేందుకు పెద్దాయన చాలా ప్రయత్నించాడు! రెండు మాత్రమే అర్థమయ్యాయి! ఒకటి గ్యానేష్, రెండోదేమో నెతన్యాహు ఏడుపు! ఇవతల ట్రంప్ కూడా డబ్బాలో రాళ్లేసి ఊపినట్లు ఏదో అంటూనే ఉన్నాడు! అందులో ఒక్కటే అర్థమయ్యింది! అది కూడా గ్యానేష్‌! నెతన్యాహు హ్రిబూలో మాట్లాడాడు! ట్రంప్ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు! ఇద్దరూ కామన్‌గా చెప్పింది గ్యానేష్ పేరు!

పెద్దాయన మాత్రం ఏమి మాట్లాడకుండా ఫోన్‌ పెట్టేశాడు! పెద్దాయన మెల్లిగా అద్దం ముందుకొచ్చాడు. ఆయన కండ్లల్లో గర్వం తొణికిసలాడుతున్నది. ఛాతీ యాభై ఆరించులు దాటి కనీసం ఇంకో ఆరించులు పెరిగి ఉంటుంది! ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ మీద నెతన్యాహుదే పెత్తనం! ప్రపంచ పోలీసుగా పిలువబడే అమెరికా మీద ట్రంప్‌దే పెత్తనం! ఇంతటి మహామహులు కూడా తమ వద్ద గ్యానేష్‌ లేడని అందువల్లే ఓటమి పాలయ్యామని అంటున్నారు! అంటే తన వద్ద వున్న గ్యానేష్‌ ఎంత గొప్పవాడో అర్థమవుతూనే ఉంది! నిజానికి అది గ్యానేష్‌ గొప్పతనం కాదు! తన గొప్పతనమే! గ్యానేష్‌ను ఆ కుర్చీలో కూర్చేబెట్టిందీ తనే! అంతకుముందులేని అధికారాలను, శక్తులను కట్టబెట్టిందీ తనే. ఎలా పనిచేయాలో నిరంతరం మార్గదర్శనం చేసిందీ తనే. తన మిత్రులు ఉత్త అమాయకులు! అంత అధికారం ఉన్నప్పుడు ఇజ్రాయిల్ గ్యానేష్‌ను, అమెరికా గ్యానేష్‌ను తయారు చేసుకోలేక పోవటం వారి చేతకాని తనం!

తయారు చేసుకోవటం తన గొప్పతనం! అసలు ఆ సీట్లో ఉంటే ఇన్ని చేయవచ్చునని ఎవరూ ఊహించనే లేదు! మరి అవన్నీ ముందే ఊహించి అమలు చేసిన తాను ఎంత గొప్పవాడు! అద్దంలో తనను తాను చూసుకుంటా తనకు తానే సెల్యూట్ కొట్టుకున్నాడు! తనివి తీరలేదు! అద్దం దగ్గరకు వెళ్లి తనకు తానే గట్టిగా ఒక ముద్దు ఇచ్చుకున్నాడు! అపుడు మనసు కొద్దిగా శాంతించింది! కాని అద్దం మీదికి ఒక బొద్దింక వచ్చింది! బొద్దింకను చూడగానే పెద్దాయన కెవ్వుమని అరిచాడు! వెంటనే బయట ఉన్న కమెండోలు లోపలికి వచ్చారు! పెద్దాయన భయంగా, భయంగా అద్దం వైపు చూపాడు. ‘‘అక్కడేం లేదు సార్!’’ అన్నారు కమెండోలు. ‘‘క... క్క కాక్రోచ్‌’’ అన్నాడు పెద్దాయన ఓ మాదిరిగా వణికిపోతూ. ‘‘నో సర్! అక్కడేం లేదు! గంట కిందటే గదంతా పది హిట్లు కొట్టాం! ఒక్క క్రాకోచ్ కూడా ఉండే ఛాన్స్ లేదు సర్!’’ అన్నారు! కమెండోలు. వారిని వెళ్లమన్నట్లు సైగ చేశాడు పెద్దాయన !

కాక్రోచ్‌ పేరు వింటేనే పెద్దాయన గుండె గుభేలు అంటున్నది అనుకుంటూ కమెండోలు బయటకు వెళ్లటం పెద్దాయనకు వినబడింది! పెద్దాయన గట్టిగా పండ్లు నూరాడు! ఒకప్పుడు తన ఎదుట తల ఎత్తుకుని నిలబడే ధైర్యం చేయలేని వారు కూడా ఇప్పుడు తన ముందే సెటైర్లు వేస్తున్నారు! మళ్లీ అద్దం ముందుకు వెళ్లాడు పెద్దాయన! అద్దం మీద తనకు కనబడిన కాక్రోచ్‌ తన భ్రమేనా! అని మళ్లీ చూశాడు! నిజమే! అక్కడ కాక్రోచ్‌ ఉంది! మరి ఇందాక వచ్చిన కమెండోలు లేరని ఎందుకు చెప్పారు! తనది భ్రమా నిజమా! మళ్లీ చూశాడు! ఈసారి ఒకటికన్నా ఎక్కువ కాక్రోచ్‌లు కనబడ్డాయి! వెంటనే టేబుల్ మీదున్న హిట్ తీసి కాక్రోచ్‌ల మీద కొట్టాడు! ఆశ్చర్యం హిట్ వాటి మీద పని చేయడం లేదు! చూస్తుండగానే కాక్రోచ్‌లు పెరిగిపోతున్నాయి. క్రమంగా అవన్నీ తన మీదికి వస్తున్నాయి! మెరుపులా ఒక అయిడియా వచ్చింది! ‘‘గ్యానేష్‌ నాకు వద్దు’’! అన్నాడు! కాక్రోచ్‌లు ఆగిపోయాయి! హమ్మయ్య అనుకున్నాడు! పెద్దాయన. కాని కాక్రోచ్‌లు ఆగలేదు! వస్తూనే ఉన్నాయి! ‘‘గ్యానేష్‌ను రాజీనామా చేయిస్తాను!’’ అంటూ అరుస్తూ అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు!


- ఉషాకిరణ్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్