Magazines

రాజ్యాంగ కుట్ర బీజేపీ, జ్ఞానేష్‌‌లదే

1 గంట క్రితం

BJP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 4 నిమిషాల చదవడం

తటస్థ మధ్యవర్తిగా వుండవలసిన భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) చాలా స్పష్టంగా అధికార పార్టీ బిజెపి పట్ల పక్షపాతంతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడటంపై నిరసనలు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి. ఇది సహించలేని ప్రభుత్వం, పాలక పార్టీ పిచ్చిపిచ్చిగా రెచ్చిపోతున్నాయి. ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారు గడ్డిపోచను పట్టుకున్నట్టు పాలక పార్టీ, దాని సోషల్‌ ‌మీడియా సైన్యం ప్రభుత్వ మార్పు కుట్ర పాట పట్టుకున్నారు. ఈ నిరసనలు ఊపందుకోవడానికి మూల కారణమైన అంశమేదో దాన్నుంచి దృష్టి మళ్లించడానికి బరితెగించి తంటాలు పడటం తప్ప ఇది మరొకటి కాదు. ఒక రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం నడిచే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల తప్పులను బయటపెట్టడం, ఒంటరి పాటు చేయడం అన్నది పాలన మార్పుకు నేపథ్యంగా వుంటాయి. రాజ్యాంగ కొలబద్దల పరిధిలో అలాంటి ప్రభుత్వ మార్పులనేవి ఆనవాయితీనే. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నడవాలనే రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించి రాజకీయ పక్షపాతంతో తప్పుదోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు దొరికిన మీదటనే ప్రస్తుత పరిస్థితిలో నిరసనలు రగుల్కొన్నాయి. అయితే ఈ నిరసనలో దాదాపు మొత్తం ప్రతిపక్షాలైన జెన్‌ ‌జీ బృందాలైనా చాలావరకూ శాంతియుతంగా వుండటం ఒక విధంగా మంచి విషయం.

ఇందులో ఒకవేళ ఎక్కడైనా ఏదైనా శాంతికి భంగం కలిగించే ఘటన జరిగిందంటే అది ప్రధానంగా భద్రతా దళాలు గతంలో ఎరగని రీతిలో సాగించిన హింసాకాండ పర్యవసానమే. భద్రతా దళాలు దాదాపు గూండాల్లా వ్యవహరించాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆఖరుకు యువ మహిళా నిరసనకారులు, మహిళా జర్నలిస్టులపై లైంగిక హింసకు పాల్పడటం వంటి ఆరోపణలకు కూడా వారు కారకులైనారు. అలాంటి ఆరోపణలు ఇంకా విచారించవలసే వుంది. భద్రతా దళాలతో పాటు వివిధ హిందూత్వ గ్రూపులకు చెందిన గూండాలు కూడా రంగంలోకి దించబడ్డాయనేది తప్పక చెప్పవలసి వుంటుంది. వారు కూడా ఈ వికృత చర్యల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సోషల్‌ ‌మీడియా యుగంలో వారి దుశ్చర్యల వీడియో సాక్ష్యాలు కూడా నమోదై వున్నాయి. ఎలాంటి సమగ్రమైన సమర్థన లేకుండానే ప్రభుత్వ మార్పు ప్రయత్నం ఆరోపణ తీసుకురాబడుతున్నది.

కానీ మరోవైపున కోట్లమంది న్యాయమైన ఓటర్లకు ఆ హక్కు లేకుండా చేసిన చట్టవిరుద్ధ చర్యకు మాత్రం బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. ఇలా తొలగించబడిన ఓటర్లు పౌరులు కాదనే కుత్సిత ఆరోపణకు కూడా ఎలాంటి వాస్తవ నిరూపణ లేదు. ఈ సమరం ఇలాంటి పూర్వ రంగంలో ప్రజాసామ్య పరిరక్షణ పోరాటంగా రూపు సంతరించుకుంటున్నది. ప్రభుత్వం నుంచి పాలక పక్షం నుంచి, దానిపై రావలసిన నిర్మాణాత్మక స్పందన రావడం లేదు. అంతేగాక ఎన్నికల సంఘంలోనే విభేదాలు న్నట్టు బయటపడింది. దానిపై భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం పరిధిలో ప్రాథమిక హక్కు కింద జరిగే నిరసనలను ప్రభుత్వ మార్పు కోసం హింసాత్మక చర్యలని చెప్పడం ప్రతీఘాతక భావమవుతుంది.

అసలైన కుట్రలేవీ?

వాస్తవానికి భద్రతా బలగాలు ప్రభుత్వ హుకుంతో సాగించిన చర్యలు... శాంతియుత నిరసనలను అనుమతిం చాలని చెబుతున్న రాజ్యాంగ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రభుత్వ మార్పు ఆరోపణ ఏ విధమైన పరీక్షకూ నిలవజాలదన్నది స్పష్టం. ఏమైనా ఆ కుత్సిత ఆరోపణ ఒక దృష్టి మళ్లింపు యత్నం మాత్రమే. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇటీవల జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న నిరసనల తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే ఈ విషయం స్పష్టపడుతుంది. బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇంకా యూరప్‌‌లో వివిధ చోట్ల పరిస్థితితో పోల్చి చూస్తే వాటికి దీనికి తేడా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. నిజానికి నిరసనలు ప్రభుత్వ మార్పునకు దారితీయడం తాజాగా సెర్బియాలో జరిగింది చూసినా కళ్లకు కడుతుంది. రెండేళ్లకు పైగా సాగిన నిరసన పోరాటాల తర్వాత విద్యార్థి సంఘాలు ‘స్టూడెంట్‌ ‌చాప్టర్‌’ అనే ఒక సాముదాయక సంస్థగా ఏర్పడి ఎన్నికల్లో అఖండ విజయం సాధించి సంచలనం సృష్టించాయి. సెర్బియా శక్తిమంతుడైన పాలకుడిగా చెప్పబడే అలెగ్జాండర్‌ ‌ఊయిక్‌‌ను ఇంటికి పంపించారు. బ్రిటిష్‌ ‌పత్రిక ‘ది గార్డియన్’ దీనిపై ఇలా రాసింది: ఈ విద్యార్థులు విదేశీ తొత్తులనే నిందారోపణలతో దెబ్బ తీసేందుకు అలెగ్జాండర్‌ ‌ఊయిక్‌‌ పదేపదే దాడి చేశారు.

దాన్ని వారు పూర్తిగా తోసిపుచ్చారు. ఊయిక్‌ ‌సర్కారు దారుణ పరిపాలన, అంతులేని అవినీతిపై పెల్లుబికిన అసంతృప్తి కారణంగానే విద్యార్థుల నిరసన, తిరుగుబాటు వచ్చాయని సెర్బియా ఫలితాలు గట్టిగా రుజువు చేశాయి. ఊయిక్‌ ఏ విధంగానైతే ప్రభుత్వ మార్పు కుట్ర ఆరోపణ లేవనెత్తి తనను తాను కాపాడుకోవాలనుకున్నాడో యూరప్‌‌లో వివిధ చోట్ల కూడా అదేవిధంగా జరిగింది. పారిస్‌, స్పెయిన్‌, గ్రీస్‌, అల్బేనియా, ఐస్‌‌లాండ్‌‌ల లోనూ నిరసనలు అంతకంతకూ తీవ్రమవడానికి ఆ దేశాల్లోని ప్రజల అసంతృప్తి కారణమైంది. నిజానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ స్వయంగా ఇలాంటి ఆరోపణలను తోసిపుచ్చాడు. ఇస్లామిక్‌ ‌వలసదారుల వల్లనే ఫ్రాన్స్‌‌లో ఇదంతా జరుగుతున్నదంటూ మితవాద శక్తులు పుట్టించిన కథలను నిరాకరించారు. అమెరికా-ఇరాన్‌ ‌యుద్ధం, దానివల్ల చమురు ధరలు పెరగడం వల్ల అంతర్గత కారణాలే ఇందుకు దోహదం చేశాయన్నారు.


భారత్‌‌లో జరిగిందేంటి?

ఈ పరిస్థితికీ ఇండియాలో జరుగుతున్నదానికి తేడా స్పష్టంగానే కనిపిస్తున్నది. తను నియమించిన తొత్తు జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌ద్వారా కోట్ల మంది న్యాయమైన ఓటర్లను తొలగింపచేసిన బిజెపి నే ఎన్నికల ఫలితాలను మాయచేయ చూసింది. పశ్చిమ బెంగాల్‌‌లో న్యాయ వ్యవస్థ పరిమితంగా జోక్యం చేసుకుని చూసినప్పుడే విచారణ ముందుకొచ్చిన తొలగింపులు మోసపూరితమని తేలింది.కనుక ప్రజాస్వామ్యం కోసం, న్యాయమైన సమ్మిళిత ఓటరు జాబితాల కోసం జరిగే పోరాటం రాజ్యాంగం మేరకు శాసనాల కోసం జరుగుతున్నదే అవుతుంది. తమ నిర్వాకాల ద్వారా జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌బాపతు ఈ ప్రక్రియకు విఘాతం కల్పిస్తున్నారు. గతంలో ప్రభుత్వాల మార్పునకు కారణమైన సంప్రదాయ ప్రక్రియను ఆటంకపరుస్తున్నారు. హిందూత్వ శిబిరానికి బాగా అలవాటైన బూటకత్వం, రెండు నాల్కల ధోరణి నుంచి పుట్టిందే ప్రభుత్వ మార్పు కుట్ర అనే తాడూ బొంగురం లేని కట్టు కథ. హిందూత్వ శక్తుల సైద్ధాంతిక మూల పీఠాధిపతి లాంటి ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఈ బూటకాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అక్టోబర్ నెలలో విజయదశమి రోజున తమ సంస్థ వార్షిక ప్రసంగం చేస్తూ మోహన్ భగవత్...ప్రభుత్వాలను అస్థిరపరచడం కోసం ''పాశ్చాత్య తుపాను, అంతర్జాతీయ కుట్ర'' జరగుతున్నాయని ఘోరమైన అభాండాలు వేశారు. ఈ దసరా ప్రసంగం నిజానికి మోహన్ భగవంత్ స్వంత కథనానికే పూర్తి విరుద్ధమైంది. మొదటిసారి అమెరికా పర్యటన జరిపినప్పుడాయన భారతదేశ గమనం, విధి, వైవిధ్యం గురించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రాపంచిక దృక్పథం గురించి అంతర్జాతీయ శ్రోతల కోసం సన్నాయి నొక్కులతో వినిపించారనేది స్పష్టమే. వాస్తవానికి ఆ ప్రసంగం మొత్తం ఇప్పుడున్న భారత రాజ్యాంగానికి కంటి తుడుపు మాటలే వినిపించినట్టుంది. కానీ ప్రస్తుతం, హిందూత్వ శక్తులు క్షేత్ర స్థాయిలో చేసే నిర్వాకాలు అందుకు పూర్తి వ్యతిరేకంగా వున్నాయనేది కనిపిస్తుంది.

మరింత మసాలా ...

ప్రభుత్వ మార్పు అనే ఈ ఆరోపణకు మరింత మసాలా జోడించినట్టుగా నిరసనకారులకు విదేశీ నిధులు అందాయని చెప్పడం ఇంకా నమ్మశక్యం కాని విషయం. ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఐ.టి విభాగాన్ని, ఇ.డి ని దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు దొరికిపోయింది. దాని పక్షపాత వైఖరిని కోర్టులే చాలా తీవ్రంగా తప్పు పట్టాయి. కనక నిజంగా నిధులే గనక వచ్చివుంటే ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం, దాని సంస్థలదే అవుతుంది. ఏమైనా ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు అమెరికా లోని వివిధ ట్రస్టుల నుంచి నిధులు పొందుతున్నాయనే దానికి చాలా సాక్ష్యాలు పెరుగుతున్నాయి. (దీనిపై ఇటీవలనే మేమొక వ్యాసం ప్రచురించాము).

మరింత నిశ్చితంగా...

చివరగా క్రోడీకరించి చెప్పాలంటే ప్రభుత్వ మార్పు, విదేశీ నిధులనేవి పాలక వ్యవస్థ ఊహల్లో ఉదయించిన కట్టుకథలు మాత్రమే. తలాతోక లేని ఈ కథనాలు ఇప్పుడు దేశంలో, విదేశాల్లో జరుగుతున్న పరిణామాలతో ఎంతమాత్రం పొసిగేవిగా లేవు. ఈ బరితెగింపు కథలనూ వీటి వెనక వున్న బేహారులను మరింత నిశ్చితమైన ప్రయత్నాలతో ఈ నిస్పృహ కథనాలను ఢీకొనవలసి వుంటుంది.

(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం-అక్టోబర్‌ 28)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్