సైన్యానికి పెంటగాన్ ఆదేశం
వాషింగ్టన్ : ఇరాన్‌పై తాజా దాడులకు సిద్ధంగా ఉండాలని సెంట్రల్ కమాండ్‌ను పెంటగాన్ ఆదేశించింది. దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ సైనిక సంసిద్ధతపై ఆదేశాలు జారీ అయ్యాయని అధికారులను ఉటంకిస్తూ ఆక్సియాస్ వార్తా సంస్థ గురువారం తెలిపింది. ఈ ఆదేశాలు చాలా రోజుల క్రితమే జారీ అయినప్పటికీ దాడులకు తేదీని మాత్రం పెంటగాన్ నిర్ణయించలేదు. అన్ని అవకాశాలను ట్రంప్ పరిశీలిస్తున్నారని, ఏ సమయంలో అయినా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని అధ్యక్షభవనం అధికారి ఒకరు చెప్పారు. మధ్యంతర ఎన్నికలకు ముందు...ముఖ్యంగా ఇజ్రాయిల్ ఎన్నికలకు ముందే సైనిక చర్య జరగవచ్చునని ఆక్సియాస్ తెలియజేసింది. ఒకవేళ సైనిక చర్య ప్రారంభమైతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, అణు లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడులు జరగవచ్చు. రాబోయే మూడు నాలుగు వారాలలో ఇరాన్‌పై దాడులు మొదలైతే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ల విజయావకాశాలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పోరు మొదలైతే చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుంది.





కామెంట్లు (0)