విజయవంతంగా లంగ్ క్యాన్సర్ ఆపరేషన్
రోమ్ : పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుడి ఊపిరితిత్తిలోని కింది భాగాన్ని తొలగించారని, ఆపరేషన్ విజయవంతం అయిందని వాటికన్ ఓ వైద్య ప్రకటనలో తెలియజేసింది. 71 సంవత్సరాల పోప్ లియోకు మంగళవారం రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో 90 నిమిషాల పాటు శాస్త్రచికిత్స జరిగింది. ఆయనకు లంగ్ అడెనోకార్సినోవా ఉన్నదని వైద్యులు నిర్ధారించారు. వాటికన్ వైద్య ప్రకటన ప్రకారం...ఆపరేషన్ విజయవంతం అయింది. ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆపరేషన్ తర్వాత పోప్ స్పృహలోకి వచ్చి కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండి తన గదికి చేరుకున్నారు. పోప్ వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండవచ్చు.పోప్ కోసం ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకొని గంటల తరబడి వేచి చూశారు. ఆయన ఆస్పత్రి లోపలికి వెళుతుండగా వారు కేరింతలు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు. పోప్ తన కారు వెనుక కిటికీని కిందికి దించి చేయి ఊపుతూ ప్రజలను చిరునవ్వుతో పలకరించారు. ఆ తర్వాత ఆస్పత్రి మెట్ల వద్ద సిబ్బంది ఆయనను కలిశారు. అండగా ఉంటామనిభరోసా ఇచ్చారు. కాగా శరీరంలోని ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించిందీ లేనిదీ తెలుసుకోవడానికి పోప్‌కు వైద్యులు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ దైవాశీస్సులు అందించిన అనంతరం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లోని బాల్కనీ నుంచి ఆదివారం పోప్ మాట్లాడుతూ తన ఆపరేషన్ గురించి స్వయంగా ప్రపంచానికి తెలియజేశారు. తన ఊపిరితిత్తులపై ఉన్న కణితి పెరుగుదల ప్రారంభ దశలోనే ఉన్నదని, దానిని తొలగించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని చెప్పారు. ఆస్పత్రికి చెందిన థొరాసిక్ సర్జరీ బృందం పోప్‌కు శస్త్రచికిత్స చేసింది. పోప్ కోలుకోవడానికి వీలుగా ఈ నెల 20వ తేదీ వరకూ ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. వచ్చే నెల ప్రారంభంలో పోప్ లాటిన్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని పోప్ నిర్ణయించారు.





కామెంట్లు (0)