Magazines

చైనాలో జోరుగా వివాహ రిజిస్ట్రేషన్లు

2 గంటల క్రితం

చైనాలో వివాహ రిజిస్ట్రేషన్లు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

పార్కులు, చారిత్రక, పర్యాటక ప్రదేశాల్లో కేంద్రాల ఏర్పాటు
2024లో కంటే పది శాతానికి పైగా పెరిగిన వివాహాలు

బీజింగ్‌ : చైనాలో వివాహ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. గ‌తేడాది దేశంలో 6.765 మిలియన్‌ వివాహాలు జరిగాయి. అంతకుముందు ఏడాది... అంటే 2024తో పోలిస్తే వివాహాల సంఖ్య 10.8 శాతం పెరిగింది. గత నెల 30వ తేదీన పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంక బులెటిన్‌ ప్రకారం.. 2025లో దేశంలో 4,162 వివాహ నమోదు కేంద్రాలు ఉన్నాయి. ప్రతి వెయ్యి మందికీ వివాహ రేటు 4.8గా నమోదైంది. 2024తో పోలిస్తే ఇది 0.5 మిల్లీ పాయింట్లు అధికం. గత ఏడాది వివాహం చేసుకున్న వారిలో 25-29 సంవ‌త్స‌రాల‌ మధ్య వయస్కులే ఎక్కువ. వివాహాలు చేసుకున్న వారిలో వీరి సంఖ్య 4.99 మిలియన్లు. 2013 నుంచి వరుసగా 13 ఏండ్ల‌ పాటు వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న నూతన వధూవరుల్లో ఈ వయసు వారే ఎక్కువగా ఉండడం విశేషం.

ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు
వివాహ నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం గతేడాది మే 10వ తేదీ నుంచి పలు చర్యలు చేపట్టింది. తమ నివాస ప్రాంతాల్లోనే వివాహాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నిబంధనలను మార్చింది. వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు పార్కులు, చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు వేదికలుగా మారాయి. దీంతో తమ వివాహ ధృవీకరణ పత్రాలను అందుకునే రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని అనుకునే జంటల కోసం ఫొటోగ్రఫీ, విందులు వంటి అనేక కొత్త వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్‌ రాష్ట్రంలో ఉన్న క్వింగ్‌డావోలో ఓ ఫిల్మ్‌ మ్యూజియం ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన వివాహ నమోదు కేంద్రం యువ జంటలకు ఇప్పుడు ఓ గమ్యస్థానంగా మారింది. ఈ కేంద్రం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ రెండు లక్షల మంది దానిని సందర్శించారు. 2,400కు పైగా జంటలు తమ వివాహాలను నమోదు చేసుకున్నాయి. వీరిలో సుమారు 40 శాతం మంది బయట నుంచి వచ్చిన వారే.
ప్రత్యేక వేదికల ఏర్పాటు
తూర్పు చైనాలోని జియాంగ్సు రాష్ట్రం కూడా వివాహ రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను సుందర ప్రదేశాలు, ప్రత్యేక ప్రాంతాలకు తరలించింది. వివాహ ధృవీకరణ పత్రాలు అందజేయడానికి ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసింది. వివాహ ఆచారాలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికలు ఏర్పాటయ్యాయి. తూర్పు చైనాలోని ఫుజియన్‌ రాష్ట్రంలో అధికారులు మరో అడుగు ముందుకు వేసి జాతీయ దినోత్సవ సెలవు రోజుల్లో (అక్టోబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకూ) కూడా వివాహ నమోదు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సెలవు దినాల్లో పార్కులను తలపించే వివాహ నమోదు కేంద్రాలను తెరిచి ఉంచుతున్నారు. దీంతో అనేక జంటలు తమ వివాహ నమోదు కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చుకుంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్