ముగిసిన 2026 ఆసియా క్రీడలు
ముగింపు వేడుకల్లో మెరిసిన భారత బృందం
నవతెలంగాణ-నగోయా
14 రోజులు, 46 దేశాలు, 43 క్రీడా పోటీలు, 469 పసిడి పతకాలు, 10 వేల మంది క్రీడాకారు లు.. రెండు వారాల అతిపెద్ద క్రీడా సంబురానికి తెరపడింది. ఆదివారం నగోయా సిటీలోని పాలోమా మిజుహో స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా ట్రాప్ షూటర్ నీరూ దండా నిలిచింది. ‘హార్ట్ బీట్ ఏచి నగోయా’ థీమ్‌తో సాగిన ముగింపు వేడుకలు ఆసియా క్రీడలకు బైబై పలికాయి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ జోహాన్ బిన్ హమద్ అల్ థాని 2026 ఆసియా క్రీడలు ముగిసినట్టు అధికారంగా ప్రకటించారు. 2023లో 21వ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దోహా (ఖతార్)కు ఆసియా క్రీడల టార్చ్, ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఫ్లాగ్‌ను అధికారికంగా అందజేశారు.
13 ఏండ్ల చిన్నది క్రీడలకే హైలైట్ : ఆసియా క్రీడల్లో చైనా అత్యధిక పతకాలు సాధించటం కొత్త విషయమేమీ కాదు. ఒలింపిక్స్‌లోనే అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న చైనా ఆసియా క్రీడల్లో పసిడి మోత మోగించటం సాధారణమే. చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, భారత్ పతక వేటలో మెప్పించినా.. 13 ఏండ్ల చైనా స్విమ్మర్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 13 ఏండ్ల వయసులో యు జిడి ఏకంగా మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. ఆసియా క్రీడల ఈత కొలనులో పసిడి మోతతో 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్ ఈత కొలనులో అలజడికి తెరలేపింది. ఆసియా క్రీడల్లో మోస్ట్ వాల్యూవబుల్ ప్లేయర్‌గా నిలిచిన యు జిడి.. ప్రపంచ స్విమ్మింగ్‌లో సరికొత్త సంచలనంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విజయవంతమే, కానీ! : ఆతిథ్యంలో జపాన్ను చూసి ప్రపంచమే నేర్చుకుంటుంది. కరోనా మహమ్మారి కఠిన సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ను గొప్పగా నిర్వహించిన ఘనత జపాన్ సొంతం. కానీ, 2026 ఆసియా క్రీడల ఆతిథ్యం జపాన్ ట్రాక్ రికార్డును దెబ్బతీసిందనే చెప్పాలి. ఖర్చు తగ్గించుకునేందుకు గేమ్స్ విలేజ్‌ను నిర్మించకుండా.. 15 వేల మంది క్రీడాకారులు, అధికారులకు హోటల్స్, చెక్కతో చేసిన కంటెయినర్లు, క్రూయిజ్ నౌకల్లో వసతి ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. సమన్వయంతో పని చేయలేకపోయారు. భారత్‌తో సహా అధిక శాతం దేశాల క్రీడాకారులు సరైన సమయంలో రూమ్స్ కేటాయింపు కోసం ఇబ్బందులు పడ్డారు. లాజిస్టికల్ సమస్యలు సైతం ఎక్కవుగానే కనిపించాయి. సమాచార లోపంతో ఓ స్టేడియంకు వెళ్లాల్సిన క్రీడాకారుల బస్సు మరో స్టేడియానికి వెళ్లాయి. దీంతో పలు ఆటల పోటీల షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. మెడల్ పోడియంపై దక్షిణ కొరియా జాతీయ గీతం బదులుగా ఉత్తర కొరియా జాతీయ గీతం వినిపించటం అందరినీ ఇరకాటం లోకి నెట్టింది. ఫుట్‌బాల్‌లో దక్షిణకొరియాపై జపాన్ గెలుపొందగా.. పతకాల ప్రదాన వేడుకలో ఆ దేశ జాతీయ గీతం వినిపించలేదు. ఇక ఆసియా క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించలేదు. అత్యధిక శాతం స్టేడియాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జపాన్, దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్‌కు వెయ్యి మంది అభిమానులు సైతం స్టేడియానికి రాలేదు.





కామెంట్లు (0)