స్టార్ క్రికెటర్‌కు 2 రోజుల్లో మరో అవకాశం
బెంగళూరు (కర్నాటక) :
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముందు టీమ్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం కనిపిస్తోంది!. ఇరానీ కప్‌లో పక్కటెముకల గాయానికి గురైన వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. నవంబర్ 19 నుంచి భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా, ఆలోపు రిషబ్ పంత్ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గాల్సి ఉంది.
ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్
రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్ పర్యటనలో రెడ్‌బాల్ ఫార్మాట్లో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉంది. సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ ఇద్దరిని భారత్-ఏ జట్టులోకి తీసుకుంది. నవంబర్ 7 నుంచి లింకన్‌లో భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ మూడో అనధికార టెస్టు ఆరంభం కానుంది. ఫిట్నెస్ పరీక్షలో పాసైన పేసర్ జశ్‌ప్రీత్ బుమ్రా సోమవారం న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అక్టోబర్ 23 నుంచి కసరత్తులతో పాటు కఠోర ప్రాక్టీస్ చేస్తున్న రిషబ్ పంత్‌కు ఆదివారం ఫిట్నెస్ పరీక్ష పెట్టారు. ఈ టెస్టులో రిషబ్ పంత్ విఫలమయ్యాడు. దీంతో బుమ్రాతో పాటు న్యూజిలాండ్‌కు బయల్దేరలేదు. రెండు రోజుల్లో ఫిట్నెస్ నిరూపించుకునేందుకు రిషబ్ పంత్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ ఇబ్బంది లేకుండా చేస్తున్న రిషబ్ పంత్ బీసీసీఐ నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలను అందుకోవాల్సి ఉంది. ఈసారి నిర్వహించే ఫిట్నెస్ టెస్టులో నెగ్గితే నవంబర్ 7 నుంచి ఆరంభమయ్యే మ్యాచ్‌కు రిషబ్ పంత్ అందుబాటులో ఉండనున్నాడు. రిషబ్ పంత్ ఫిట్నెస్ సాధించేందుకు మరింత సమయం తీసుకుంటే, నేరుగా టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాతో చేరే అవకాశం కనిపిస్తోంది. రిషబ్ పంత్‌కు గాయంతో యువ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రను భారత్-ఏ జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భారత టెస్టు జట్టులో రిషబ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ సైతం ఉన్నాడు. దీంతో తొలి టెస్టుకు పంత్ అందుబాటులో లేకుంటే, ధ్రువ్ జురెల్‌ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఆసియా గేమ్స్‌లో చివరగా ఆడిన జశ్‌ప్రీత్ బుమ్రా సొంత నగరం అహ్మదాబాద్‌లో రెగ్యులర్‌గా సాధన చేస్తున్నాడు. బెంగళూరులోని సీఓఈలో ఫిట్నెస్ టెస్టు ముగించుకున్న బుమ్రా భారత్-ఏ తరఫున మూడో అనధికార టెస్టులో ఆడనున్నాడు.





కామెంట్లు (0)