Magazines

ఫిలిప్స్ ఫటాఫట్‌

1 గంట క్రితం

Philips
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 3 నిమిషాల చదవడం

సెంచరీతో చెలరేగిన కివీస్‌ బ్యాటర్‌
నాల్గో టీ20లో 87 పరుగులతో భారత్‌ ఓటమి


ఆక్లాండ్‌‌లో పరుగుల వరద పారింది!. కానీ అందరూ ఊహించినట్టు భారత బ్యాటర్లు చెలరేగలేదు. సిరీస్‌‌లో నిలకడగా రాణిస్తున్న గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ (107) ఈడెన్‌‌పార్క్‌‌లో సెంచరీతో విశ్వరూపం చూపించాడు. మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌ (65) ‌సైతం రాణించటంతో న్యూజిలాండ్‌ 259 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేశారు. 87 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ‌ఘన విజయం సాధించింది.


నవతెలంగాణ-ఆక్లాండ్‌

భారత్‌, న్యూజిలాండ్‌ ‌టీ20 సిరీస్‌ ‌ఫలితం వెల్లింగ్టన్‌‌లోనే తేలినా.. ఆక్లాండ్‌‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ ‌పంజా విసిరింది. బ్యాట్‌‌తో, బంతితో పైచేయి సాధించిన న్యూజిలాండ్‌ ‌నాల్గో టీ20లో 87 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1-3తో గెలుపు రుచి చూసింది. గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ (107, 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌‌లు), మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌ (65, 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌‌లు) దంచికొట్టగా తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 259 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో టీమ్‌ ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసింది. భారత్‌ ‌తరఫున తిలక్‌ ‌వర్మ (35, 35 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) అత్యధిక స్కోరు చేశాడు. సెంచరీతో కదంతొక్కిన గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, న్యూజిలాండ్‌ ఆఖరు టీ20 ఆదివారం హామిల్టన్‌‌లో జరుగనుంది.

​ఛేదనలో చతికిల

రికార్డు ఛేదనలో టీమ్‌ ఇండియా చతికిల పడింది. పవర్‌‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్‌ (4), ఇషాన్‌ ‌కిషన్‌ (0), శ్రేయస్‌ అయ్యర్‌ (22, 11 బంతుల్లో 4 ఫోర్లు), అభిషేక్‌ ‌శర్మ (27, 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ‌ఆరు ఓవర్లలోపే అవుటయ్యారు. నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి (21, 10 బంతుల్లో 2 సిక్స్‌‌లు), అక్షర్‌ ‌పటేల్‌ (7) ‌నిష్క్రమణతో భారత్‌ 89/6తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. తిలక్‌ ‌వర్మ (35), నమన్‌ ‌ధీర్‌ (28, 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) కాసేపు వికెట్ల పతనం నిలువరించినా ఫలితం లేకపోయింది. ప్రిన్స్‌ ‌యాదవ్‌ (18 నాటౌట్‌, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అలరించాడు. న్యూజిలాండ్‌ ‌బౌలర్లలో జాకబ్‌ ‌డఫ్ఫీ (4/23) నాలుగు వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫిషర్‌ (2/40), మిచెల్‌ ‌శాంట్నర్‌ (2/24) రాణించారు.

​ఫిలిప్స్‌ ‌పంజా

క్రైస్ట్‌‌చర్చ్‌‌లో వరుస అర్థ సెంచరీలు చేసిన గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ ఆక్లాండ్‌‌లో విరుచుకుపడ్డాడు. చిన్న బౌండరీల ఈడెన్‌‌పార్క్‌‌లో ఇరగదీశాడు. 10 సిక్స్‌‌లు, ఆరు ఫోర్లతో చెలరేగిన ఫిలిప్స్‌ 49 ‌బంతుల్లో 107 పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్‌ ‌టిమ్‌ ‌సీఫర్ట్‌ (3), డార్లీ మిచెల్‌ (24) విఫలమైనా.. ఫిన్‌ అలెన్‌ (31, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడుగా ఫిలిప్స్‌ ‌పంజా విసిరాడు. పవర్‌‌ప్లేలో 2 వికెట్లకు 67 పరుగులే చేసిన న్యూజిలాండ్‌ ‌భారీ స్కోరు చేస్తుందనే అంచనాలు లేవు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 బంతుల్లో అర్థ సెంచరీ బాదిన పిలిప్స్‌.. మరో 15 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేరుకున్నాడు. ఫిన్‌ అలెన్‌ అవుటైనా.. మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌ ‌తోడుగా ఫిలిప్స్‌ ‌దంచికొట్టాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో బ్రాస్‌‌వెల్‌ 19 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. 15.5 ఓవర్లలోనే 200 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ ఆఖర్లోనూ అదరగొట్టింది. సిరీస్‌‌లో అత్యధిక స్కోరు 259 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్‌ ‌యాదవ్‌ (3/48) మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌, ప్రిన్స్‌ ‌యాదవ్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, అక్షర్‌ ‌పటేల్‌ ‌తలా ఓ వికెట్‌ ‌ఖాతాలో వేసుకున్నారు.

​స్కోరు వివరాలు

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ : టిమ్‌ ‌సీఫ్టర్‌ (‌సి) ప్రిన్స్‌ ‌యాదవ్‌ (‌బి) మయాంక్‌ 3, ఫిన్‌ అలెన్‌ (‌సి) అభిషేక్‌ (‌బి) అక్షర్‌ 31, డార్లీ మిచెల్‌ (‌ఎల్బీ) మయాంక్‌ 24, గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ (‌సి)అభిషేక్‌ (‌బి) నితీశ్‌ 107, బెవాన్‌ ‌జాకబ్స్‌ (‌సి) అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ (‌బి) మయాంక్‌ 7, మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌ (ఎల్బీ) ప్రిన్స్‌ ‌యాదవ్‌ 65, మిచెల్‌ ‌శాంట్నర్‌ (‌సి) నితీశ్ (బి) అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ 5, నాథన్‌ ‌స్మిత్‌ ‌నాటౌట్‌ 6‌, ఆడం మిల్నె నాటౌట్‌ 1, ఎక్స్‌‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 259.

వికెట్ల పతనం : 1-5, 2-34, 3-93, 4-112, 5-227, 6-246, 7-252.

బౌలింగ్‌ : మయాంక్‌ ‌యాదవ్‌ 4-0-48-3, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ 4-0-38-1, ప్రిన్స్‌ ‌యాదవ్‌ 4-0-49-1, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి 4-0-64-1, అక్షర్‌ ‌పటేల్‌ 3-0-43-1, నమన్‌ ‌ధీర్‌ 1-0-16-0.

భారత్‌ ఇన్నింగ్స్‌ : సంజు శాంసన్‌ (‌సి) సీఫ్టర్‌ (‌బి) డఫ్ఫీ 4, అభిషేక్‌ ‌(సి) శాంట్నర్ (బి) ఫిషర్‌ 27, ఇషాన్‌ (‌సి,బి) డఫ్ఫీ 0, శ్రేయస్‌ (‌బి) మిల్నె 22, అక్షర్‌ (‌సి,బి) శాంట్నర్‌ 7, నితీశ్‌ (‌సి) బ్రాస్‌‌వెల్‌ (‌బి) శాంట్నర్‌ 21, తిలక్‌ ‌వర్మ (సి) సీఫర్ట్‌ (‌బి) ఫిషర్‌ 35, నమన్‌ ‌ధీర్‌ (‌సి) స్మిత్‌ (‌బి) డఫ్ఫీ 28, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ (‌సి) జాకబ్స్‌ (‌బి) డఫ్ఫీ 0, ప్రిన్స్‌ ‌యాదవ్‌ ‌నాటౌట్‌ 18, మయాంక్‌ ‌యాదవ్‌ ‌నాటౌట్‌ 3, ఎక్స్‌‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 172.

వికెట్ల పతనం : 1-4, 2-4, 3-50, 4-56, 5-86, 6-89, 7-121, 8-121, 9-158.

బౌలింగ్‌ : జాకబ్‌ ‌డఫ్పీ 4-0-23-4, ఆడం మిల్నె 4-0-35-1, నాథన్‌ ‌స్మిత్‌ 4-0-47-0, మాథ్యూ ఫిషర్‌ 4-0-40-2, మిచెల్‌ ‌శాంట్నర్‌ 4-0-24-2.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్