- మట్టి పరిమళాలు – రైతాంగ పోరు గీతాలు’ వీడియో పాటల ఆవిష్కరణ
-రైతాంగ సమస్యలు, పోరాటాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీడియో సాంగ్స్ శక్తివంతమైన సాధనాలు: జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్: అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా ప్రజానాట్యమండలి (PNM), T10 సంయుక్తంగా రూపొందించిన ‘మట్టి పరిమళాలు – రైతాంగ పోరు గీతాలు’ వీడియో పాటలను మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సోమవారం నల్గొండ పట్టణంలోని ఎంఎస్ఎన్ గార్డెన్ లో ఆవిష్కరించారు.
రైతాంగ ఉద్యమ చరిత్ర, వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల జీవన పోరాటాలు, హక్కుల సాధన కోసం సాగుతున్న ఉద్యమాలు, కనీస మద్దతు ధర (MSP) సహా రైతాంగ ప్రధాన డిమాండ్లను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక వీడియో సాంగ్స్‌ను రూపొందించారు. కళ, సాహిత్యం, సంగీతం, ఆధునిక దృశ్య మాధ్యమాలను సమన్వయం చేస్తూ రైతాంగ ఉద్యమ సందేశాన్ని విస్తృత ప్రజానీకానికి చేరవేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, రైతుల బతుకులు, వారి సమస్యలు, హక్కుల కోసం సాగుతున్న పోరాటాలను ప్రజలకు చేరవేయడంలో పాటలు అత్యంత శక్తివంతమైన మాధ్యమాలని పేర్కొన్నారు. ఉద్యమాలు కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాకుండా కళలు, సాహిత్యం, సంగీతం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు చేరాలని అన్నారు. AIKS జాతీయ మహాసభల ప్రచారంలో ‘మట్టి పరిమళాలు’ వీడియో పాటలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్గొండ గడ్డపై దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగ నాయకులు, ప్రతినిధులు ఒకచోట చేరడం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన విషయమని ఆయన అన్నారు. జాతీయ మహాసభలకు సంబంధించిన విశేషాలు, రైతాంగ నేతల సందేశాలు, చర్చలు, తీర్మానాలు దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయడంలో సోషల్ మీడియా బృందాలు కీలక బాధ్యత పోషించాలని పిలుపునిచ్చారు.
రైతాంగ హక్కుల సాధనకు డిజిటల్ మాధ్యమాలు తోడ్పడాలి: టి. సాగర్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ, రైతాంగ పోరాటాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా పాటలను రూపొందించిన ప్రజానాట్యమండలి బృందానికి, వాటిని ఆధునిక సాంకేతికతతో వీడియో రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్న T10 బృందానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ వంటి కీలక హక్కుల సాధన కోసం రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. AIKS 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయడంలో సంప్రదాయ మీడియాతో పాటు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు విస్తృతంగా భాగస్వాములు కావాలని కోరారు. రైతాంగ సమస్యలను గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చర్చలోకి తీసుకురావడంలో డిజిటల్ వేదికలు కీలకంగా నిలవాలని అన్నారు.
ఆధునిక సాంకేతికతతో రైతాంగ ఉద్యమానికి కొత్త ప్రచార రూపం: బండారు రవికుమార్
తెలంగాణ సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి బండారు రవికుమార్ మాట్లాడుతూ, మల్టీ కెమెరా చిత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నిర్మాణ విలువలతో రైతాంగ పోరు గీతాలను వీడియో రూపంలో రూపొందించడం అభినందనీయమైన ప్రయోగమని అన్నారు.
ప్రజా ఉద్యమాల సందేశాన్ని కొత్త తరానికి చేరవేయడానికి సంప్రదాయ ప్రచార పద్ధతులతో పాటు ఆధునిక డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, ప్రజా పోరాటాల చరిత్రను యువతకు చేరువ చేయడంలో ఇలాంటి సృజనాత్మక ప్రయత్నాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
‘మట్టి పరిమళాలు’ వీడియో పాటలను సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షలాది మందికి చేరవేయాలని, ప్రతి ఒక్కరూ ఈ పాటలను విస్తృతంగా షేర్ చేసి AIKS జాతీయ మహాసభల ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రైతాంగ పోరాట స్ఫూర్తిని డిజిటల్ వేదికలలోకి : ఎండి అబ్బాస్
రైతాంగ ఉద్యమ చరిత్రను, వీరోచిత పోరాటాలను, నేటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను డిజిటల్ వేధిక ద్వారా ద్వారా ప్రజలకు చేరవేయడం చాలా అవసరం అని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ అన్నారు. AIKS 36వ జాతీయ మహాసభల సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడమే ‘మట్టి పరిమళాలు’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
సాంస్కృతిక ఉద్యమానికి ఆధునిక డిజిటల్ సాంకేతికతను జోడిస్తూ రూపొందించిన ఈ వీడియో పాటలు రైతాంగ సమస్యలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు యువతను రైతాంగ ఉద్యమ భావజాలానికి చేరువ చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
PNM–T10 సంయుక్త కృషితో ‘మట్టి పరిమళాలు‘
ఈ కార్యక్రమానికి T10 CEO సుందర్ అధ్యక్షత వహించారు. ప్రజానాట్యమండలి (PNM) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జె. వినోద్, కట్టా నర్సింహ ఈ పాటల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. సంగీత దర్శకుడు ఐలు నేతృత్వంలో గీతాలకు సంగీతం సమకూర్చగా, ప్రజానాట్యమండలి కళాకారులు, రచయితలు, గాయకులు తమ సృజనాత్మక భాగస్వామ్యాన్ని అందించారు. T10 బృందం ఆధునిక చిత్రీకరణ, వీడియో నిర్మాణం, సాంకేతిక రూపకల్పన బాధ్యతలను చేపట్టింది.
ఈ కార్యక్రమంలో AIKS జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం బాధ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వి వెంకటేశ్వర్లు, భూపాల్, శ్రీరామ్ నాయక్, ఆశయ్య, వెంకటేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డి మల్లేశం, ప్రమీళ, పాలడుగు నాగార్జున, సయ్యద్ ఆశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మి నారాయణ, ఐత విజయ్, అనగంటి వెంకటేష్, కోట రమేష్, టి నాగరాజు, రజినీ కాంత్, మమత, పుచ్చకాయల నర్సిరెడ్డి, కె శంకర్, డి. రామకృష్ణ, ఆదేష్, సలీం, సత్తయ్య, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)