నవతెలంగాణ-హైదరాబాద్: సీజ్ చేసిన వస్తువుల్లో మీర్పేట కానిస్టేబుల్ చేతివాటం చూపించాడు. భద్రంగా ఉంచాల్సిన వస్తువులను కాజేశాడు. పోలీసుల పూర్తి వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 30న వరకట్నం వేధింపుల కారణంగా తమ కూతురు చనిపోయిందని గట్ల పద్మ అనే మహిళ హైదరాబాద్ లోని మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా, కనీసం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు అధికారులు. పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, బంగారు, వెండి ఆభరణాలను ఆగస్టు 22న మీర్పేట పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి, ఎస్హెచ్ఓ (SHO), సెక్టార్ ఎస్ఐ ఉమా మహేశ్వరి సమక్షంలో పోలీస్ కానిస్టేబుల్ (PC) ఎన్. శ్రవణ్ కుమార్ (PC 10464)కు అప్పగించారు.
కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ నిందితుడు A1కి చెందిన స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ నుండి అక్రమంగా రూ. 1,70,000 నగదును బదిలీ చేశారు. ఇందులో రూ. 1,37,000ను తన భార్య ఖాతాకు, మిగిలిన మొత్తాన్ని మల్లకేడి శివాజీ అనే వ్యక్తికి పంపారు. అంతేకాకుండా, నిందితుడు A2కి సంబంధించి స్వాధీనం చేసుకున్న 122.2 గ్రాముల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి, రూ. 12,37,000 పొందారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, నిందితుడు A5కి చెందిన మొబైల్ ఫోన్ను తిరిగి అతడికే ఇచ్చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న వస్తువులనే దుర్వినియోగం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.






కామెంట్లు (0)