Magazines

బస్సు టైర్ల కింద పడి గాయపడిన కండక్టర్‌ ప్రవళిక మృతి

1 గంట క్రితం

RTC conductor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మణుగూరు ఆర్టీసీ కండక్టర్‌ గుండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి మృతిచెందారు. గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో చోటుచేసుకున్న వివాదం ఈ ఘటనకు కారణమైంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దిగేందుకు ఓ ప్రయాణికురాలు తన కుమారుడికి హాఫ్‌ టికెట్‌ ఇవ్వాలని కోరుతూ కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చింది. చిల్లర విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


మిట్టగూడెం స్టాప్‌ వద్ద బస్సు దిగేందుకు ప్రయత్నించిన ప్రయాణికురాలిని కండక్టర్‌ డోర్‌ వద్ద నిలువరించడంతో వివాదం మరింత ముదిరింది. బస్సు స్టాప్‌ దాటుతున్న సమయంలో ప్రయాణికురాలు కండక్టర్‌ను నెట్టివేయడంతో ప్రవళిక రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో బస్సు వెనుక టైర్లు ఆమె కుడికాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తొలుత స్థానికంగా చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ సంజీవని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.


ప్రవళిక మృతిపట్ల తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ)తోపాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సంయుక్తంగా రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


కండక్టర్‌ ప్రవళిక మృతికి సంతాపంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు పి. కమాల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మర్రి నరేందర్‌, ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానా తదితరులు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన తెలపనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్