Magazines

సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

1 గంట క్రితం

Senior IPS officer N. Balasubrahmanyam passes away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ పోలీస్, పాలనా విభాగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పోలీస్, ప్రభుత్వ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో పలు కీలక పదవులు చేపట్టి విశేష సేవలందించారు. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో శాంతిభద్రతలు, రవాణా, సాంకేతిక పాలన వంటి విభాగాల్లో సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు పొందారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, ఈ-ప్రగతి అథారిటీ సీఈఓగా, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.


వివిధ శాఖల్లో తనదైన ముద్ర వేస్తూ పరిపాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. 2026 ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థతతో పనిచేసిన ఆయన సహచర అధికారులు, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.

బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఏపీ పోలీస్ శాఖ, ఆర్టీసీ అధికారులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మరణం రాష్ట్ర పోలీస్, పరిపాలనా రంగాలకు తీరని లోటుగా అభివర్ణించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్