Magazines

శాండ్‌పేపర్‌ గేట్‌పై ఉస్మాన్‌ ఖవాజా సంచలన ఆరోపణలు

10 గంటల క్రితం

Usman Khawaja's sensational allegations on Sandpaper Gate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : 2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘శాండ్‌పేపర్‌ గేట్‌’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బాల్‌ ట్యాంపరింగ్‌ కుట్ర గురించి జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకే కాకుండా పర్యటనలో ఉన్న సభ్యులందరికీ ముందే తెలుసని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా సంచలన ఆరోపణలు చేశాడు. తన ఆత్మకథ ‘సబ్ర్‌’లో ఈ విషయాలను వెల్లడించాడు.


2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ టెస్టులో కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటనకు ముందే పోర్ట్‌ ఎలిజబెత్‌ టెస్టులోనూ శాండ్‌పేపర్‌ ఉపయోగించారని ఖవాజా ఆరోపించాడు. బంతిని ఒకవైపు రఫ్‌గా మార్చేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో బహిరంగంగా చర్చలు జరిగాయని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో జట్టు మొత్తం సమష్టి బాధ్యత వహించాలని అప్పట్లో సహచరులను కోరినట్లు తెలిపాడు.


అయితే అప్పట్లో క్రికెట్‌ ఆస్ట్రేలియా జరిపిన విచారణలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లకే ఈ కుట్ర గురించి ముందస్తు సమాచారం ఉందని తేల్చింది. స్మిత్‌, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఖవాజా తాజా ఆరోపణలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పందిస్తూ.. గతంలో జరిపిన విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని, కొత్తగా సంబంధిత సమాచారం ఉంటే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వచ్చే వారం ఖవాజా ఆత్మకథ విడుదల కానుండటంతో ఈ వివాదంపై మరోసారి చర్చ మొదలైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్