నవతెలంగాణ - హైదరాబాద్ : త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో సోమవారం స్మగ్లింగ్ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. స్థానిక గ్రామస్థులకు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో అసిస్టెంట్ కమాండెంట్ రోహిత్ కుమార్ సహా నలుగురు సిబ్బంది గాయపడ్డారు. 49వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ సిబ్బందికి, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఓ జవాన్ గ్రామస్థుడిపై లాఠీతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు బాక్సానగర్–రహీంపూర్ రహదారిని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడికి చేరుకున్న అసిస్టెంట్ కమాండెంట్ బృందంపై గ్రామస్థులు దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో రోహిత్ కుమార్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అదనపు బలగాలను పంపించారు. గాయపడిన సిబ్బందిని బాక్సానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.




కామెంట్లు (0)