Magazines

తెలంగాణలో కరువు దృష్ట్యా ఉపాధి హామీ పనులు కల్పించాలి

54 నిమిషాల క్రితం

Gummadi Narsaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

నవతెలంగాణ-సత్తుపల్లి 

తెలంగాణలో ఎల్-నీనో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య డిమాండ్ చేశారు. సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్‌లో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి నరసయ్య మాట్లాడారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూలీలకు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని కోరారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పిస్తూ, రోజు కూలీ రూ.800 అందించాలని, ఈ డిమాండ్లపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం వ్యవసాయ కూలీలకు 'ఇందిరమ్మ భరోసా' కింద జీవన భృతి రూ.12వేలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయని రాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సైతం తమ వాగ్దానాల మేరకు ఉపాధి హామీ పనిని 150 రోజులకు పెంచి, రోజు కూలీ రూ.800 ఇవ్వాలన్నారు.


కరువు పరిస్థితులపై మండలాధికారులు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో పని అడిగిన ప్రతి ఒక్కరికీ వెంటనే పని కల్పించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, నాయకులు కూరాకుల నరసయ్య, సోమనపల్లి వెంకటేశ్వర్లు, రెంటాల యాదగిరి, ఈర్ల వెంకట అప్పారావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్