Magazines

స్కీం వర్కర్లకూ రెండు డీఏలు వర్తింపజేయాలి

6 గంటల క్రితం

Two DAs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి

- పీఆర్సీ అమలు చేయాలి

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్‌ డిమాండ్‌

నవతెలంగాణ - అశ్వారావుపేట

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను స్కీం వర్కర్లకు కూడా వర్తింపజేయాలని, ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించి పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం అశ్వారావుపేట లోని స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో ఎస్‌కే నన్ని అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో మహిళలు అనేక ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వారిని కార్మికులుగా గుర్తించడంలో, కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా వేతనాలు పెంచకుండా పనిభారం పెంచడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


స్కీం వర్కర్లకు నెలకు కనీస వేతనం రూ.30 వేలు నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను వీరికీ వర్తింపజేయాలని కోరారు. గత పీఆర్సీలో ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు పారితోషికం ఆధారంగా పీఆర్సీ అమలు చేసినప్పటికీ, కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న బహుళ రోజుల ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.


ఈ సమావేశంలో సీఐటీయూ మండల నాయకులు కృష్ణవేణి, ఏసు, భారతి, యామిని, సీత, రంజిత్‌ కుమార్‌, పద్మ, భవాని, ప్రవీణ, వెంకటరమణ, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్