- ప్రధాన యూనియన్ల ఫ్లెక్సీల్లో విప్ బీర్ల ఫొటో.. ఆయన మద్దతు ఎవరికి?
నవతెలంగాణ-యాదగిరిగుట్ట: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట డిపోలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర, రీజియన్ స్థాయిల్లో ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న ప్రధాన యూనియన్లు.. గుట్ట డిపోకు వచ్చేసరికి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫొటోను తమ ఫ్లెక్సీల్లో ఉపయోగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే టిడబ్ల్యూయూకు మద్దతు ప్రకటించింది. ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ)తో కలిసి టిడబ్ల్యూయూ కూటమిగా ఏర్పడి, బీర్ల ఐలయ్యను గౌరవ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. మరో ప్రధాన యూనియన్ ఈయూ (ఏఐటీయూసీ) టీఎంయూ, ఎన్‌ఎంయూలతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఈ కూటమి కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు బీర్ల ఐలయ్య ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.
మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తున్న టీజేఎంయూ సైతం ‘మేము ఐలన్న మనుషులం’ అంటూ బీర్ల ఐలయ్య ఫొటోతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 339 ఓట్లు ఉన్నాయి. ప్రధాన యూనియన్లన్నీ బీర్ల ఐలయ్య ఫొటోలను తమ ప్రచార ఫ్లెక్సీల్లో ఉపయోగిస్తూ ఆయన తమవైపే ఉన్నారనే సంకేతాలు ఇస్తుండటంతో కార్మికుల్లో చర్చ జరుగుతోంది. అయితే బీర్ల ఐలయ్య బహిరంగంగా ఏదైనా ఒక యూనియన్‌కు మద్దతు ఇస్తారా? లేక అన్ని యూనియన్లకూ అందుబాటులో ఉండే నాయకుడిగా కొనసాగుతారా? అనే చర్చ డిపో కార్మికుల్లో సాగుతోంది.





కామెంట్‌లు (0)