- కాలానికి అనుగుణంగా రూపుమారుతున్న బూరుగు వృక్షం
- 3 కాలాల్లోనూ 3 రకాల మార్పులు
- వృక్షాన్ని చూసి కాలాన్ని చెబుతున్న గ్రామస్తులు చిందం రాజమౌళి
నవతెలంగాణ - గంగాధర
ఎన్నో పెను గాలులు, విపత్కర పరిస్థితులకు ఎదురేగి పచ్చదనంతో అలరారుతున్న ఈ బూరుగు వృక్షానికి అక్షరాల 140 ఏళ్లట. కాలానికి అనుగుణంగా రూపుమాతున్న ఈ వృక్షం 3 కాలాల్లోనూ 3 రకాల మార్పులు చోటు చేసుకుని రాబోయే కాలాన్ని ముందే చాటుతున్న తీరు ఇది. గంగాధర మండలం చర్లపల్లి (ఆర్) గ్రామంలో ఏపుగా పెరిగి పచ్చదనంతో ఉట్టిపడుతున్న బూరుగు వృక్షానికి ఓ ప్రత్యేకతే ఉంది.
సుమారు 140 ఏళ్ల క్రితం నాటి ఈ వృక్షం రాబోయే కాలాలను ముందే చూపుతూ 3 కాలాల్లోనూ 3 రకాల మార్పులు చోటు చేసుకుంటుందట. వేసవి కాలంలో ఆకులు రాలిపోయి వృక్షం మెాడువారినట్టు ఉంటుందని, వర్షాకాలంలో లేలేత ఆకులు చిగురిస్తూ కనువిందు చేస్తుందట. ప్రస్తుత చలి కాలంలో పచ్చదనంతో అలరారుతూ కనిపిస్తున్న ఈ వృక్షం రాబోయే కాలం ఏంటో ముందే చూపుతూ ప్రత్యేకతను చాటుకుంటుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇంత ప్రత్యేకత గల ఈ వృక్షాన్ని గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ వృక్షం కింద పోచమ్మ తల్లి ఆలయం ఉండగా, పచ్చదనం పరుచుకుని పక్షుల కిలకిలరావాలతో అలరారుతూ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామానికి వచ్చివెళ్లే బంధువులు బూరుగు వృక్షం ప్రత్యేకతను విని ఆసక్తిగా తిలకిస్తున్నారు.







కామెంట్లు (0)