నవతెలంగాణ – పరకాల
గత మూడేండ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రులు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పరకాల మండలం నాగారం గ్రామంతో పాటు పరకాల పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన వేర్వేరు సమీక్షా సమావేశాల్లో పార్టీ ఇంచార్జి సాంబారి సమ్మారావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లకోసారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కేసీఆర్ హయాంలో పచ్చగా ఉన్న తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో కరువు పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. పార్టీ ఇంచార్జి సాంబారి సమ్మారావు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. గ్రామాలు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తించి, గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం తాజా నిబంధనల ప్రకారం తిరిగి నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి,చింతం సదానందం, ప్రకాష్ రావు, మధుసూదన్ రెడ్డి, అలియాబాద్ సర్పంచ్ సనత్, మున్సిపల్ కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, మాజీ కౌన్సిలర్ అడప రాము,మాజీ ఎఎంసి డైరెక్టర్ నక్క చిరంజీవి,బొట్ల నరేష్, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)