సీపీఐ(ఎం) నాయకుల ఘన నివాళి
నవతెలంగాణ – కాప్రా
హైదరాబాద్ నగరంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కామ్రేడ్ ఎన్వీ భాస్కరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) నాయకులు కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం కమలానగర్లోని సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో కామ్రేడ్ ఎన్వీ భాస్కరరావు 42వ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ(ఎం) కాప్రా సర్కిల్ కార్యదర్శి జి. శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె. చంద్రశేఖర్, కోమటి రవి తదితరులు భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ.. చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితులైన భాస్కరరావు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కామ్రేడ్ సుందరయ్యకు కొరియర్గా పనిచేశారని గుర్తుచేశారు. అనంతరం హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంగా చేసుకొని ఉద్యమాన్ని విస్తరించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. ప్రతి కార్యకర్తతో వ్యక్తిగత అనుబంధం పెంపొందించుకొని, వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యమ నాయకులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రజాశక్తి పత్రికను నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన క్రమశిక్షణ, పట్టుదల, కార్యకర్తల పట్ల చూపిన ఆప్యాయతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం జె. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భాస్కరరావు తన కార్యాచరణతో పార్టీని అభివృద్ధి చేసి, విమర్శలకు ఆచరణ ద్వారానే సమాధానం చెప్పారని అన్నారు. కోమటి రవి మాట్లాడుతూ.. భాస్కరరావు చూపిన దృఢ సంకల్పం, పత్రికా విస్తరణ కోసం చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
నవతెలంగాణ పత్రిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జగ్గరాజు, దేవిరెడ్డి, శ్రీమన్నారాయణ, శారద తదితరులు మాట్లాడుతూ.. ఎన్వీ భాస్కరరావు చేసిన ఉద్యమ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు భాస్కరరావు చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జగ్గరాజు, సీహెచ్ ప్రసాద్, శ్రీమన్నారాయణ, దేవిరెడ్డి, గణేష్, సత్యనారాయణ, సీహెచ్ లీలావతి, శారద, శోభ, గౌస్య, ఎం. శ్రీనివాసరావు, బంగారు ఆచార్యులు, కేవీపీఎస్ రమేష్, జి. శివరామకృష్ణ, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)