మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చర్లకోల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్
రైతులు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చి సమయంలో నీరు అందక పంటలు ఎండిపోతుంటే, రైతులు కన్నీటి చుక్కలు ప్రజా ప్రభుత్వానికి కనిపించడం లేదని మాజీమంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి ప్రజా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. శనివారం మండలంలోని మంగలిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని తుల్జా నాయక్ తండాలో ఎండిపోయిన సోమ్లా నాయక్ వరి పంటను స్థానిక రైతులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు నాయకులకు కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీమంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 'ప్రజా ప్రభుత్వం', ఇప్పుడు ఆరుగాలం శ్రమించిన రైతన్నలను నట్టేట ముంచిందని ఆరోపించారు. చేతికొచ్చిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి నిర్వహణ లోపం, విద్యుత్ కోతల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పొలాల వైపు రావడం లేదని, రైతులను పలకరించి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడని లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేస్తోందని, తాము ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పంట నష్టపరిహారం, సాగునీరు, కరెంట్ అందక నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు తగిన ఆర్థిక సాయం, పంట నష్టపరిహారం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.
వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించాలనీ, నిలిచిపోయిన రైతు పెట్టుబడి సహాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ యాదయ్య, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు, ప్రనిల్ చందర్, నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ సుదర్శన్, వాడియాల సర్పంచ్ చంద్రయ్య గౌడ్, గంజి కృష్ణ, వెంకటయ్య, మంద భీమ్ రాజ్, జగన్ గౌడ్, యాదయ్య, మాతృనాయక్, గోపాల్ నాయక్, రామకృష్ణ ,రాఘవేందర్, మంగలి నరసింహ,శేఖర్ ,నరసింహ , రాములు, నాగరాజు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)