Magazines

రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత

36 నిమిషాల క్రితం

Druggs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం

ఒడిశా నుంచి ముంబైకి గంజాయి అక్రమ రవాణా
ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. మరో ఇద్దరు పరారీ

నవతెలంగాణ–నాగోలు

ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఈ దాడిలో సుమారు రూ.30 లక్షల విలువైన 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


శనివారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ బి. అనురాధ కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన సమా మహ్మద్ అమెర్ చికెన్ వ్యాపారం చేస్తుండగా, చంద్రాయణగుట్ట తూర్ కాలనీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్ అలియాస్ ఇమ్రాన్ అలియాస్ జిద్దీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో ఎన్డీపీఎస్ సహా ఇతర కేసులు నమోదయ్యాయి. అమెర్‌పై కంచన్‌బాగ్, చౌటుప్పల్, నార్సింగి, ఛత్రినాక, షాహలీబండ పోలీస్ స్టేషన్లలో ఐదు ఎన్డీపీఎస్ కేసులు ఉండగా, గతంలో పీడీ యాక్ట్ కింద కూడా జైలుకు వెళ్లాడు. ఇమ్రాన్‌పై గోల్కొండ, మైలార్‌దేవ్‌పల్లి, చౌటుప్పల్, బండ్లగూడ పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు ఉన్నాయి.


Druggsవీరిద్దరూ ఒడిశాకు చెందిన పూర్ణచంద్ర మహాపాత్ర వద్ద కిలో గంజాయిని రూ.7 వేల చొప్పున కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని ముంబైకి తరలించేవారు. అక్కడ యాస్మిన్ చంద్ నయ్యద్ అలియాస్ చంద్ భాయ్‌కు కిలో రూ.15 వేల చొప్పున విక్రయిస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఇదే తరహాలో గంజాయిని ముంబైకి తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో ఒడిశా నుంచి మారుతీ సుజుకీ కారులో గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ బృందం, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామ శివారులోని మసాలా కంపెనీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.


Druggsశనివారం ఉదయం 11.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న కారును అడ్డుకుని తనిఖీ చేయగా, వెనుక సీటు వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యాబిన్‌లో 60 ప్యాకెట్లుగా భద్రపరిచిన 60 కిలోల గంజాయి బయటపడింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని అమెర్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని డీసీపీ అనురాధ తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ మనోహర్, అడిషనల్ డీసీపీ షకీర్ హుస్సేన్, ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ ఎన్. వెంకటరమణ, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, పోచారం ఐటీ కారిడార్ ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్