- డిసెంబర్ 20న అవార్డు ప్రదానం
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లికి చెందిన సామాజిక వేత్త పోలిశెట్టి శివకుమార్ ప్రతిష్టాత్మక సేవారత్న అవార్డు-2026 కు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విశ్వజనని ఫౌండేషన్ ప్రతి ఏటా వివిధ రంగాల్లోని సేవకులను గుర్తించి ఈ అవార్డును అందజేస్తారు. ఫౌండేషన్ చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం, సభ్యులు మాడా ఉమామహేశ్వరరావు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. గత 18 సంవత్సరాలుగా సత్తుపల్లి, పరిసర ప్రాంతాల్లో శివకుమార్ నిరంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్, ఆర్యవైశ్య సంఘం ద్వారా అంతిమ సంస్కారాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో శివకుమార్ విశేష సేవలు అందించారు. సమాజానికి ఆయన చేసిన నిష్కామ సేవలను గుర్తిస్తూ ఫౌండేషన్ నిర్వాహకులు శివకుమార్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. వచ్చే డిసెంబర్ 20వ తేదీన నరసరావుపేటలో జరిగే విశ్వజనని ఫౌండేషన్ వార్షికోత్సవంలో ఈ అవార్డును శివకుమార్‌కు ప్రదానం చేయనున్నారు. ప్రతిష్టాత్మకమైన సేవారత్న అవార్డుకు ఎంపిక కావడం పట్ల పోలిశెట్టి శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ స్థాయికి చేరుకోవడానికి తన వెన్నంటి నిలిచిన మిత్రులు, ఆర్యవైశ్య పెద్దలు, పట్టణ ప్రముఖులకు ఈ సందర్భంగా శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. శివకుమార్‌కు సేవారత్న అవార్డు రావడం పట్ల సత్తుపల్లి పట్టణ ప్రజలు, వివిధ సేవా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.





కామెంట్‌లు (0)