Magazines

యూపీలో బీజేపీ అభివృద్ధి డొల్ల

2 గంటల క్రితం

వికసిత్‌ భారత్‌-2047
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 4 నిమిషాల చదవడం

పేదరికం తగ్గిందని ప్రచారాలు.. పెరగని రాష్ట్ర ప్రజల ఆదాయం

జాతీయ సగటులో సగమే తలసరి ఆదాయం.. 'సంక్షేమం' పేరుతో ప్రభుత్వం గొప్పలు

స్వయం సమృద్ధిని విస్మరిస్తున్న వైనం.. మోడీ–యోగి పాలనలో ఉపాధి కొరత

ఉద్యోగావకాశాలు లేక మహిళలకు తిప్పలు.

అభివృద్ధి నినాదాలకు, ఆర్థిక వాస్తవాలకు మధ్య అంతరం

మోడీ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌-2047’ నినాదంలోని డొల్లతనం వెల్లడౌతుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కూడా అభివృద్ధి గురించి పెద్దఎత్తున స్వీయ ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఆ ప్రచారానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పొంతనే లేకపోవడం గమనార్హం. యూపీలో బహుముఖ పేదరికం నుంచి చాలామంది పేదలు బయటపడినట్టు నిటి ఆయోగ్‌ చెప్తోంది. కానీ ఆ రాష్ర్ట తలసరి ఆదాయం జాతీయ సగటులో సగం మాత్రమే ఉండటం ప్రస్తావనార్హం. ఉపాధి, మహిళల ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబాటుతనం కొనసాగుతోంది. సంక్షేమ పథకాలతో కొంత ఉపశమనం కల్పించి, దానిద్వారా పేదల్లో దారిద్ర్యాన్ని దూరం చేసామని చెప్పడం విచిత్రం. సహజంగా ఏ రాష్ర్టంలో అయినా ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థిక స్వావలంబన సాధించాలి. అలా కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తుండటం అభివృద్ది ఎలా అవుతుందనే ప్రశ్నలకు నిటి ఆయోగ్‌ ‌సమాధానాలు చెప్పాల్సిందే. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యోగి సర్కార్‌ ఏదో సాధించామని చెప్పుకొనేందుకు అంకెల గారడీ ప్రదర్శిస్తున్నదనడానికి ఇదే నిదర్శనం.

న్యూఢిల్లీ : యూపీలో పేదరికం తగ్గిందంటూ ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కానీ ప్రజల ఆదాయాలు ఎందుకు పెరగడం లేదు? పరిశ్రమలు, సేవల రంగాల్లో తగినన్ని ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు? మహిళలు ఎందుకు పెద్ద సంఖ్యలో ఉపాధికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, యోగి సర్కారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. సర్కారు అభివృద్ధి ప్రచారానికి, ప్రజల జీవన వాస్తవాలకు మధ్య ఉన్న అంతరాన్ని యూపీ ఆర్థిక గణాంకాలు బయటపెడుతున్నాయి.

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో 2013-14 నుంచి 2022-23 మధ్య 5.94 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నిటి ఆయోగ్‌ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే అత్యల్ప స్థానంలో ఉండటం గమనార్హం. ప్రజల ఆదాయాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థలో అవసరమైన మార్పులు జరగకపోవడం ఆ రాష్ర్టంలో ప్రధాన సమస్య. మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక పురోగతిని గొప్పగా ప్రచారం చేస్తున్న వేళ, యోగి పాలనలోని అతిపెద్ద రాష్ట్రంలోనే ఆదాయాల అంతరం కొనసాగడం ఆ ప్రచారంలోని విరుద్ధతను బయటపెడుతోంది. యూపీలో బహుముఖ పేదరిక 2019-21 నాటికి 22.9 శాతంగా ఉంది. నిటి ఆయోగ్‌ అంచనాలు యూపీలో పేదరికం తగ్గిందని చెప్తున్నా.. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లోనూ కీలకమైన బహుముఖ పేదరిక సూచికలకు అవసరమైన కొన్ని వివరాలు అందుబాటులో లేవు. అందువల్ల తాజా పరిస్థితిని అంచనా వేయడానికి సమగ్ర గణాంకాలు అవసరమని విశ్లేషకులు చెప్తున్నారు.

పిల్లల ఆరోగ్య సూచికలు ఆందోళనకరం

పిల్లల ఆరోగ్య సూచికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో తక్కువ బరువుతో ఉన్న పిల్లల శాతం 32.1 నుంచి 34.5కు, వయసుకు తగ్గ బరువు లేకపోవడానికి సంబంధించిన మరో సూచిక అయిన పోషకాహార లోపం 17.3 నుంచి 19.2 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో ఈ రెండు సూచికలు తగ్గడం గమనార్హం. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనతో పాటు కుటుంబాలకు పోషకాహారం కొనగలిగే ఆదాయం కూడా అవసరమని ఈ గణాంకాలు చెప్తున్నాయి.

ఆదాయాల అంతరం తగ్గేదెప్పుడు?

రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం.. 2011-12లో యూపీ తలసరి ఆదాయం జాతీయ సగటులో 51.4 శాతంగా ఉంది. ఆ తర్వాత దశాబ్దం పాటు ఈ నిష్పత్తి దాదాపు 50-52 శాతం మధ్యే కొనసాగింది. గత రెండేండ్లలో కొంత మెరుగుదల కనిపించినా.. జాతీయ సగటులో సుమారు 55 శాతానికి మాత్రమే చేరడం గమనార్హం. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు నెమ్మదిగా సాగడం. 2025 అక్టోబర్‌-డిసెంబర్‌ కార్మిక సర్వే ప్రకారం.. యూపీ కార్మికుల్లో 50.3 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఈ వాటా 43.2 శాతం. సేవల రంగంలో రాష్ట్రంలో 26.8 శాతం మంది పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా ఈ వాటా 32.8 శాతం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా 2017-18లో 24 శాతం నుంచి 2024-25లో 24.9 శాతానికి పెరిగింది. వ్యవసాయం నుంచి అధిక ఉత్పాదకత కలిగిన పరిశ్రమలు, సేవల రంగాలకు కార్మికులు మారకపోతే ఆదాయాల పెరుగుదల పరిమితంగానే ఉంటుంది. పెట్టుబడులు, అభివృద్ధి గురించి ప్రకటనలు చేయడం ఒక ఎత్తయితే, ప్రజలకు స్థిరమైన ఉద్యోగాలు కల్పించడం మరో ఎత్తు. బీజేపీ 'డబుల్‌ ఇంజిన్‌' ప్రభుత్వాలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

మహిళలకు ఉపాధి అవకాశాలేవీ?

యోగి పాలనలో మహిళల ఉపాధి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. 15 ఏండ్లు దాటిన మహిళల్లో 24 శాతం మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉండటం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండటం వంటివి చేస్తున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 34.9 శాతంగా ఉంది. ఇక యూపీలో పట్టణ మహిళల కార్మిక భాగస్వామ్యం 14.7 శాతంగానే ఉండటం గమనార్హం. రాష్ట్ర నిరుద్యోగ రేటు ఐదు శాతం కాగా, జాతీయ సగటు 4.8 శాతం. యువత నిరుద్యోగిత కూడా రాష్ట్రంలో 15.1 శాతంగా ఉండగా, జాతీయ స్థాయిలో 14.3 శాతంగా ఉంది. మహిళలకు సురక్షిత ప్రయాణం, పిల్లల సంరక్షణ కేంద్రాలు, పనిచేసే మహిళలకు వసతి, ఇండ్లకు దగ్గరగా ఉద్యోగాలు అందుబాటులో లేకపోతే వారి ఆర్థిక స్వావలంబన కష్టమే. మహిళల సాధికారత గురించి రాజకీయ ప్రసంగాలు చేయడం కంటే, వారికి వాస్తవంగా ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యమని సామాజిక శాస్త్రవేత్తలు, మేధావులు చెప్తున్నారు.


నినాదాలు కాదు.. ఉద్యోగాలే గీటురాయి

యూపీ ఆర్థిక పరిస్థితి మోడీ ప్రభుత్వం ప్రకటిస్తున్న ‘వికసిత్‌ భారత్‌-2047’ లక్ష్యానికి కూడా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం మాత్రమే సరిపోదు.. వారి చేతుల్లో ఆదాయం పెరగాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, మహిళలకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనికోసం ఆహార శుద్ధి, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ వంటి కార్మికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను జిల్లాల స్థాయిలో విస్తరించాలి. చిన్న, మధ్య తరహా పట్టణాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఎన్ని పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయనే దానికంటే, వాస్తవంగా ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, ఎన్ని స్థిరమైన ఉద్యోగాలు వచ్చాయి అనే అంశాలే అభివృద్ధికి కొలమానాలు కావాలి. తాజా కుటుంబ ఆరోగ్య, కార్మిక గణాంకాలను కూడా సమయానికి విడుదల చేయాలని విశ్లేషకులు చెప్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్