ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందం గౌడ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామనీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా జాప్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ లోని సంఘ భవనంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో జీవో 190ని అమలు చేయాలన్నారు. ఎంప్లాయీస్ నూతన హెల్త్ స్కీంను పారదర్శకంగా అమలు చేయాలనీ, క్షేత్ర స్థాయిలో నెలకొన్న ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరారు. పీఆర్సీపై కాలయాపన సరి కాదన్నారు. డీయస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్, మోడల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. రేషనలైజేషన్ జీవో 25ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష, గిరిజన సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి మినిమం టైం స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు యం.పర్వత్ రెడ్డి, నాయకులు సయ్యద్ సాబేర్ ఆలీ, ఎల్.యం. ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, పోల్ రెడ్డి, ఎ. వి.సుధాకర్, శంకర్ మాతంగి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)