Magazines

జేఎన్‌యూ విద్యార్థుల పోరాట విజయం

1 గంట క్రితం

Victory for the JNU students' struggle
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

17 రోజుల నిరాహార దీక్ష విరమణ

ఐదుగురు విద్యార్థులపై బహిష్కరణ వేటు రద్దు

ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణకు అంగీకారం

నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో

విద్యార్థుల ఐక్యపోరాటంతో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయంలో విజయం లభించింది. విద్యార్థి సంఘం నాయకులతో సహా ఐదుగురిపై విధించిన బహిష్కరణ వేటు చర్యలను యాజమాన్యం ఉపసంహరిం చుకోవడంతో 17 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షను నేత‌లు విర‌మించారు. విద్యార్థుల ఇతర ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి కూడా అధికారులు అంగీకరించారు. అక్టోబర్‌ 3న ప్రారంభమైన ఈ దీక్షలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు, ఎస్ఎఫ్ఐ నాయ‌కురాలు కె. గోపిక బాబు, విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అదితి మిశ్రా, ప్రధాన కార్యదర్శి సునీల్‌ యాదవ్‌ తదితరులు పోరాటానికి నాయకత్వం వహించారు.

విద్యార్థి సంఘం ప్రతినిధులపై తీసుకున్న బ‌హిష్క‌ర‌ణ వేటు చర్యలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌పై యాజమాన్యం అంగీక‌రించింది. ఐదుగురు విద్యార్థులు అదితి మిశ్రా, కె. గోపిక బాబు, సునీల్‌ యాదవ్‌, డానిష్‌ అలీ, నితీశ్‌ కుమార్‌లపై విధించిన బహిష్కరణను తక్షణమే రద్దు చేస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించు కోవడానికి, నిరసనల సందర్భంగా ప్రారంభించిన క్రమశిక్షణ విచారణలను నిలిపివేయడానికి కూడా అంగీకారం కుదిరింది.

13 డిమాండ్లతో పోరాటం

విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించాలని, చీఫ్‌ ప్రాక్టర్‌ కార్యాలయ నిబంధనల్లోని వివాదాస్పద అంశాలను తొలగించాలని, లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి గతంలో ఉన్న జెండర్‌ సెన్సిటైజేషన్‌ కమిటీ ఎగైనెస్ట్‌ సెక్సువల్‌ హరాస్‌మెంట్ (జిఎస్‌క్యాష్‌)ను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. జేఎన్‌యూ ప్రవేశ పరీక్షను తిరిగి ప్రవేశపెట్టడం, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం సహా మొత్తం 13 డిమాండ్లతో నిరాహార దీక్ష చేపట్టారు. చీఫ్‌ ప్రాక్టర్‌ కార్యాలయ నిబంధనలపై విద్యార్థి సంఘం ప్రతినిధితో కూడిన కమిటీ సమీక్ష జరిపి, వివాదాస్పద నిబంధనల తొలగింపునకు సిఫారసులు చేయనుంది. జెఎన్‌యు ప్రవేశ పరీక్ష పునరుద్ధరణ అంశాన్ని పరిశీలించేందుకు కూడా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల, గ్రంథాలయాల పనివేళల పొడిగింపు, ఇతర విద్యార్థి సమస్యల పరిష్కారానికి యాజ‌మాన్యం అంగీకారం తెలిపింది.

ఆరోగ్యం క్షీణించినా వెనక్కి తగ్గని విద్యార్థులు

నిరాహార దీక్ష రోజులు గడుస్తున్న కొద్దీ విద్యార్థుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. వాంతులు, నీరసం వంటి సమస్యలతో నడవడానికి కూడా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారు పోరాటాన్ని కొనసాగించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ వైఖరిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులతో పాటు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు వి.శివ‌దాస‌న్ విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థి ఐక్యతతో సాధించిన ఈ విజయం హామీల అమలుతోనే సంపూర్ణమవుతుందని విద్యార్థి సంఘం స్పష్టం చేసింది. తమ డిమాండ్ల అమలును పర్యవేక్షిస్తామని, ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసుకుంటామని తెలిపింది.

ఎయిమ్స్‌కు జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్య‌క్షురాలు గోపిక‌బాబు త‌ర‌లింపు

ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిన ఎస్ఎఫ్ఐ నేత‌, జెఎన్‌యుఎస్‌యు ఉపాధ్య‌క్షురాలు గోపిక బాబు, ఎస్ఎఫ్ఐ జెఎన్‌యు నేత అభిన‌య్‌, ఏఐఎస్ఏ నేత గులాంల‌ను ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. వారిలో గోపిక బాబు, అభిన‌య్‌లకు ఐసీయూ చేర్చి వైద్యం అందించారు. ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో వారిని సాధార‌ణ వార్డుకు ఉంచి, వైద్యం అందిస్తున్నారు. వారిని ఎస్ఎఫ్ఐ అఖిల భార‌త అధ్య‌క్షుడు ఆద‌ర్శ్ ఎం. సాజి, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి సూర‌జ్ ఎలామ‌న్‌లు ప‌రామ‌ర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్