Magazines

ఆరోగ్య పరికరమా.. ఖరీదైన ప్రయోగమా?

3 గంటల క్రితం

health
avatar
balaji

ప్రచురించబడింది నవం 20, 2026 | 4 నిమిషాల చదవడం

రూ.85 వేలకే ‘టెంపుల్‌’ వెల్‌నెస్‌ పరికరం...
మెదడుకు రక్తప్రసరణ నుంచి శరీర శ్రమ వరకు కొలుస్తుందంటూ ప్రచారం

శాస్త్రీయ ఆధారాలపై వైద్య నిపుణుల సందేహాలు

వ్యక్తిగత ఆరోగ్య సమాచార భద్రతపై ఆందోళనలు


న్యూఢిల్లీ : రూ.85 వేల ధరతో మార్కెట్లోకి వస్తున్న ఓ చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరం ఇప్పుడు ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. మెదడుకు ఎంత రక్తం సరఫరా అవుతోంది? శరీరం ఎంత శ్రమిస్తోంది? నిద్ర, వ్యాయామం, ఆహారం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? వంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని దీని తయారీ సంస్థ చెప్తోంది. అయితే ఈ వాదనలకు స్వతంత్ర శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, దీన్ని వైద్య పరికరంగా కాకుండా సాధారణ ఆరోగ్య పర్యవేక్షణ సాధనంగా పేర్కొంటూ నియంత్రణ నిబంధనల పరిధి నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌ మాజీ సీఈఓ దీపిందర్‌ గోయల్‌ స్థాపించిన టెంపుల్‌ సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. ‘టెంపుల్‌-01’ పేరుతో వస్తున్న ఇది రెండు గ్రాముల కన్నా తక్కువ బరువుతో, చెవి పక్కన తలకు అతికించుకునేలా ఉంటుంది. గుండె వేగం, మెదడుకు రక్తప్రసరణకు సంబంధించిన ‘బ్రెయిన్‌ ఫ్లో’ సూచీ, శరీర శ్రమను తెలిపే ‘ఎంట్రపీ’ స్కోరును కొలుస్తుందని సంస్థ చెప్తోంది. భవిష్యత్తులో వినియోగదారుడి గొంతును గుర్తించే ఏఐ సౌకర్యాన్ని కూడా తీసుకురావాలని భావిస్తోంది. నవంబర్‌ 1 నుంచి ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించగా, ఒక్కో పరికరం ధర రూ.85 వేలు. సుమారు మూడు నెలల్లో డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.

గుండె వేగంపై సంస్థ సొంత పరిశోధన

ఈ పరికరం సామర్థ్యంపై సందేహాలు తొలగించే స్వతంత్ర పరిశోధనలు ఇంకా జరగ లేదు. అక్టోబర్‌ 31న సంస్థ స్వయంగా నిర్వహించి, విశ్లేషించిన అధ్యయనంలో 43 మంది ఆరోగ్య వంతులపై ట్రెడ్‌మిల్‌ పరీక్షలు నిర్వహించింది. గుండె వేగాన్ని కొలిచే విషయంలో టెంపుల్‌ ఇతర ప్రముఖ పరికరాల కంటే మెరుగైన ఫలితాలు ఇచ్చిందని పేర్కొంది. కానీ ఈ పరీక్షలు ప్రయోగశాలలో ట్రెడ్‌మిల్‌కే పరిమితం కావడం, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, సాధారణ జీవన పరిస్థితుల్లో పరీక్షలు జరగకపోవడం వంటి లోపాలున్నాయి. పైగా ఈ అధ్యయనానికి స్వతంత్ర పరిశోధకుల ధ్రువీకరణ, శాస్త్రీయ సమీక్ష ఇంకా లభించలేదు.

వైద్య పరికరమా.. వెల్‌నెస్‌ సాధనమా?

ఇక్కడే ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్‌లో వైద్య పరికరాల తయారీ, విక్రయాలను డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం, 1940, మెడికల్‌ డివైజెస్‌ నిబంధనలు, 2017 నియంత్రిస్తాయి. ఒక పరికరం వైద్యపరమైన ప్రయోజనాలను చెప్తే, దాని ఉద్దేశం ఆధారంగా నియంత్రణ పరిధిలోకి వస్తుంది. వైద్య పరికరంగా గుర్తిస్తే అనుమతులు, నాణ్యత ప్రమాణాలు, అవసరమైన క్లినికల్‌ పరీక్షలు తప్పనిసరి. కానీ సాధారణ ఆరోగ్య పరికరమని చెప్పుకుంటే ఈ నిబంధనల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. టెంపుల్‌ పరికరం మెదడుకు రక్తప్రసరణను అంచనా వేయడం, శరీర శ్రమను కొలవడం, భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థి తులను అంచనా వేయగల సంకేతాలను సేకరిం చడం వంటి వాదనలు చేస్తోంది. అయినప్పటికీ వైద్య పరికరం కాదని సంస్థ చెప్తోంది. ఈ వర్గీకరణ లోనే అసలు సమస్య ఉందని విశ్లేషకులు చెప్తు న్నారు. వైద్య పరికరంగా గుర్తిస్తే ప్రభుత్వ అను మతులు, క్లినికల్‌ పరీక్షలు, నాణ్యత నియంత్రణ, సైబర్‌ భద్రత, పరికరంలోని సాఫ్ట్‌వేర్‌ మార్పులపై పర్యవేక్షణ అవసరం. టెంపుల్‌ విష యంలో మాత్రం అలాంటి నియంత్రణలు వర్తిస్తు న్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిక రంపై కేంద్ర వైద్య పరికరాల నియంత్రణ సంస్థ (సీడీ ఎస్‌సీఓ) నుంచి ఇప్పటివరకు బహిరంగ ప్రకటన లేదు.

అంతర్జాతీయంగా ఇదే గందరగోళం

అమెరికాలోనూ ఇలాంటి పరిణామాలే కని పించాయి. ‘హూప్‌’ అనే సంస్థ రక్తపోటును కొలిచే సదుపాయంపై అక్కడి ఎఫ్‌డీఏ అభ్యం తరం వ్యక్తం చేసింది. అనంతరం 2026 జనవరిలో సాధారణ ఆరోగ్య పరికరాలకు సంబంధించిన మార్గదర్శకాలను మార్చడంతో, జూన్‌లో ఆ హెచ్చరికను ఉపసంహ రించుకుంది. మరోవైపు అల్ట్రాహ్యూమన్‌, గాబిట్‌ వంటి సంస్థలు కూడా ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, వాటి ఆధారంగా సేవలు, ఉత్పత్తులను విక్రయిస్తు న్నాయి. తక్కువ ధర స్మార్ట్‌వాచ్‌లు సైతం రక్తపోటు, రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలను కొలుస్తామని ప్రచారం చేస్తున్నా, వాటి ఖచ్చితత్వంపై వైద్య నిపుణులకు సందేహాలున్నాయి.


మెదడుకు రక్తప్రసరణపై సందేహాలు

మెదడుకు రక్తప్రసరణను కొలుస్తామన్న వాదన మరింత వివాదాస్పదంగా ఉంది. దీనిపై సంస్థ చేసిన పరిశోధ నలో కేవలం 23 మంది యువకుల సమాచారాన్ని ఉపయోగించింది. సంబంధిత ఫలితాలు మెదడులో రక్తప్రవాహాన్ని నేరుగా కొలుస్తున్నాయని నిరూపించ లేవని వైద్యులు చెప్తున్నారు. తల చర్మానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల నుంచి వచ్చే సంకేతాలను కూడా ఈ పరికరం గుర్తించే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


ఎంట్రపీ స్కోరుకు ఆధారాలేవీ?

శరీర శ్రమను తెలిపే ‘ఎంట్రపీ’ స్కోరుపై ఇప్పటివరకు ఎలాంటి పరిశోధన ప్రచురించలేదు. ఈ స్కోరు 1 నుంచి 250 మధ్య ఉంటుందని, తక్కువ స్కోరు విశ్రాంతిని, ఎక్కువ స్కోరు శరీరం తీవ్రంగా శ్రమిస్తున్న స్థితిని సూచిస్తుందని సంస్థ చెప్తోంది. అయితే ఈ కొలతకు శాస్త్రీయ ఆధారాలు ఏమిటన్నది ఇంకా స్పష్టత లేదు. అలాగే పరికరంలోని చలన సెన్సర్ల ద్వారా వినియోగ దారుడి గొంతును మాత్రమే గుర్తిస్తామని, చుట్టుపక్కల వారి మాటలను వినదని సంస్థ చెప్తున్నప్పటికీ, దీనిపైనా స్వతంత్ర పరీక్షలు జరగలేదు.


మన డేటా విదేశీ సర్వర్లలో..

మరో కీలక సమస్య వ్యక్తిగత సమాచార భద్రత. గుండె వేగం, నిద్ర, కదలికలు, బరువు, ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి, మహిళల రుతుచక్రం వంటి వివరాలను టెంపుల్‌ సేకరిం చనుంది. ఈ సమాచారాన్ని ప్రకటనల కోసం విక్రయించబోమని సంస్థ హామీ ఇస్తోంది. అయితే గుర్తింపు తొలగించిన సమాచారాన్ని పరిశోధన లకు, పరికరం పనితీరు మెరుగుపర్చడానికి ఉపయోగించవచ్చని, వినియోగదారుడు ఖాతా తొలగించిన తర్వాత కూడా కొంత సమాచారాన్ని ఉంచవచ్చని విధాన పత్రంలో పేర్కొంది. డేటా విదేశీ సర్వర్లలో నిల్వ చేసే అవకాశమూ ఉంది. ఏఐ సేవలందించే థర్డ్‌ పార్టీ సంస్థలతోనూ సమా చారం సంబంధం కలిగి ఉండే అవకాశం ఉందని విధాన పత్రం చెప్తోంది.


ఆరోగ్యం పేరుతో ఖరీదైన వ్యాపారం

టెంపుల్‌ పరికరం నిజంగా ఉప యోగకరమైనదిగా నిరూపిత మవుతుందా? లేక శాస్త్రీయ ఆధా రాల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ఖరీదైన ప్రయోగంగా మిగిలి పోతుందా? అన్నది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఆరోగ్యాన్ని కొలుస్తామనే పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచా రాన్ని సేకరించే సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్నదే అసలు ప్రశ్న. ఆరోగ్య సంరక్షణ బాధ్యత క్రమంగా ప్రజల వ్యక్తిగత కొనుగోళ్లపైకి మళ్లుతున్న తరు ణంలో, శాస్త్రీయ ధ్రువీకరణ, సమాచార భద్రత, ప్రభుత్వ నియంత్రణ అత్యంత కీలకంగా మారాయి.


చట్టాల అమలులోనూ లోటుపాట్లు
భారత్‌లో డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం, 2023కు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు 2027 మే నుంచి అమల్లోకి రానున్నాయి. అప్పటివరకు ఆరోగ్య, బయోమెట్రిక్‌ సమాచారానికి సంబంధించిన పాత నిబంధనలే వర్తిస్తాయి. కొత్త చట్టంలో ఆరోగ్య సమాచా రానికి ప్రత్యేక సున్నిత సమాచార వర్గీకరణ లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. యూరప్‌లో ఆరోగ్య సమాచారాన్ని సున్నితమైన వ్యక్తిగత సమాచారంగా పరిగణించి ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్‌లో మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నది ప్రస్తుతం సంస్థ స్వచ్ఛందంగా ఇచ్చే హామీగానే ఉంది.







ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్