ప్రాణభయంతో పరుగులు తీసిన పాలస్తీనియన్లు
జెరుసలేం : గాజా స్ప్రిప్లో తన నియంత్రణలోని లేని భూభాగంపై ఇజ్రాయిల్ దళాలు భూతల దాడులు జరిపాయి. ఇజ్రాయిల్ ట్యాంకులు ఫిరంగి దాడులు జరుపుతూ నుసైరత్ శరణార్థి శిబిరానికి తూర్పు దిశగా ముందుకు సాగాయని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్లే రహదారి పైకి దూసుకుపోయాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. బుధవారం ప్రారంభమైన ఈ అరుదైన ఆపరేషన్ గురువారం ముగిసింది. తాము ఆక్రమించిన గాజా భూభాగంలో 60 శాతానికి పైగా ఉన్న ప్రాంతాన్ని సూచించే 'ఎల్లో లైన్' రేఖకు పశ్చిమాన ఉన్న ఉగ్రవాద సొరంగాన్ని ధ్వంసం చేసేందుకే భూతల దాడులు జరిపామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. కాగా గత సంవత్సరం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ ఉల్లంఘించిందని హమాస్ ఆరోపించింది. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందు ఆ ప్రాంతం నుంచి తరలిపోవాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ సేనలు హెచ్చరించాయి. దీంతో వారంతా భయాందోళనలతో పరుగులు పెట్టారు. సలాV్‌ా అల్-దిన్ రహదారిలోని కొంత భాగాన్ని ఇజ్రాయిల్ సేనలు మూసివేశాయి. ఇజ్రాయిల్ ఆక్రమణదారులు ఇప్పుడు ప్రజల నివాసాలు, గుడారాల వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని ఓ పాలస్తీనా శరణార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వీడియోలో భూతల దాడులు జరిగిన ప్రాంతం నుంచి కాల్పుల శబ్దాలు వినిపించాయి. నిరాశ్రయులైన ప్రజలు తలదాచుకుంటున్న ప్రాంతాలపై ఇజ్రాయిల్ దళాలు కాల్పులు జరుపుతుండడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని మరో శరణార్థి తెలిపాడు. 'మా దుప్పట్లు, దిండ్లు, బట్టలు సహా వేటినీ వెంటతీసుకొని పోలేకపోతున్నాం. అన్నింటినీ అక్కడే వదిలేసి పోవడం మినహా మరో దారి లేదు' అని వాపోయాడు.






కామెంట్లు (0)