Magazines

మోడీ సర్కారులో అభద్రతా భావం

1 గంట క్రితం

insecurity
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 3 నిమిషాల చదవడం

నిరసనలను అణచివేస్తున్న తీరే ఉదాహరణ

కేంద్ర విధానాలతో పెరిగేది ప్రజాగ్రహమే

నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో యువతలో అసంతృప్తి

ఎన్నికల సంఘం స్వతంత్రతపైనా వీధుల్లో చర్చ

మహిళలు, యువత తమవైపు ఉన్నారన్న బీజేపీ ధీమాకు గండి

బీజేపీ సర్కారు తీరుపై రాజకీయ పరిశీలకులు


‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. కానీ ప్రజల నిరసనలను అధికార మార్పు కుట్రగా చిత్రీకరించడం మోడీ సర్కారుకు ఉన్న అభద్రతా భావాన్ని బయటపెడుతోంది. తమ పాలనకు ఎదురే లేదని ప్రచారం చేసుకున్న మోడీ సర్కారు.. ఇప్పుడు నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, సంస్థల స్వతంత్రతపై ప్రశ్నలు, యువత ఆందోళనలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. నిరసనకారులతో చర్చించాల్సింది పోయి పోలీసు బలాన్ని ప్రయోగిస్తుండటం బీజేపీ రాజకీయ ఆధిపత్యానికే ముప్పుగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.’


న్యూఢిల్లీ : ప్రజల అసంతృప్తిని అర్థం చేసుకొని పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. నిరసనలను అధికార మార్పు కుట్రగా అభివర్ణిస్తే, అది తన బలహీనతను తానే బయట పెట్టుకున్నట్టే. ప్రజాస్వామ్యంలో ప్రధాన మంత్రి అయినా, ప్రభుత్వమైనా శాశ్వతం కాదు. ప్రజలు కోరుకుంటే మరో నాయకుడిని, మరో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు వారికి ఉంది. అయితే 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మిస్తామంటూ తన పాలనను గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ సర్కారు.. ఇప్పుడు ప్రజా నిరసనలను రాజకీయ ముప్పుగా చూస్తోంది. మోడీ ప్రధానిగా 13వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతోంది. గత ప్రభుత్వాలపై నెపం నెట్టడం ద్వారా ప్రస్తుత సమస్యల నుంచి తప్పించుకునే పరిస్థితి ఇప్పుడు లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ, ముంబయిలో జరుగుతున్న నిరసనల్లో బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోనూ ప్రజలు పాల్గొనడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశమని అంటున్నారు.

ఏడు అంశాలు.. బీజేపీకి సవాళ్లు

1. మిత్రపక్షాల్లో మారుతున్న వైఖరి

గతంలో బీజేపీకి కీలక సందర్భాల్లో మద్దతిచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌ వంటి పార్టీలు ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ తొలగింపును కోరుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ కూడా నిరసనకారులకు మద్దతుగా నిలవడం బీజేపీకి మరో సవాలుగా మారింది. మిత్రపక్షాల మద్దతు ఎప్పటికీ స్థిరంగా ఉంటుందన్న నమ్మకం సడలుతోంది.

2. ఆర్థిక ఇబ్బందులతో ప్రజాగ్రహం

దేశ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉందంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలకు భద్రమైన ఉద్యోగాలు, పెరుగుతున్న నిజమైన ఆదాయాలు అందడం లేదు. యువత, పట్టణ, గ్రామీణ నిరుద్యోగం, అధిక ధరలు, గ్రామీణ వేతనాల్లో స్తబ్దత ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల తరలింపు, రూపాయి బలహీనత, మార్కెట్లలో ఒడిదుడుకులు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అధికారానికి దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న విమర్శలు అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నాయి.

3. అధికార యంత్రాంగంలోనూ 
మార్పు సంకేతాలు

విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకోవడం అధికార యంత్రాంగం లోనూ చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలకు అధికారులు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భావన పెరుగుతోంది. ఎన్నికల సంఘంలో విభేదాలపై వార్తలు రావడం కూడా వ్యవస్థలో అంతర్గత అసంతృప్తికి సంకేతంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

4. సంస్థల స్వతంత్రతపై ప్రజల్లో చర్చ

ఎన్నికల సంఘం నియామకాలు, ఓటర్ల జాబితాలు, న్యాయవ్యవస్థ జవాబుదారీతనం వంటి అంశాలు గతంలో నిపుణుల చర్చలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు సామాజిక మాధ్య మాలు, స్వతంత్ర మీడియా ద్వారా సామాన్య ప్రజల్లోకి చేరుతున్నాయి. రాజ్యాంగ సంస్థలను అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుతున్నారన్న విమర్శలు నిరసనల్లో ప్రధాన అంశాలుగా మారుతున్నాయి.

5. మహిళలు, యువతపై 
బీజేపీ ఆశలకు ఎదురుదెబ్బ

మహిళలు, యువతే తమ బలమని బీజేపీ చెప్పుకుంటున్నప్పటికీ.. ఆ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. నీట్‌ పరీక్షలు, నియామకాల్లో జాప్యం, ఉద్యోగాల కొరత, అస్థిరమైన ఉపాధి యువతను కలవరపెడుతున్నాయి. నిటి ఆయోగ్‌ అంచనా ప్రకారం 8.7 కోట్ల మంది యువత విద్య, ఉపాధి, శిక్షణకు దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2029 నాటికి 18–32 ఏండ్ల వయసున్న జెన్‌-జీ జనాభా దాదాపు 38 కోట్లకు చేరవచ్చు. యువతపై పోలీసు చర్యలు, ఇంటర్నెట్‌ ఆంక్షలు వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న బీజేపీ వాదనను తప్పని నిరూపిస్తున్నాయి.

6. దళిత నాయకత్వంతో యువజన ఐక్యత
కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నాయకత్వంలోని ఉద్యమం బీజేపీకి కొత్త సవాలుగా మారుతోంది. దళిత అస్తిత్వాన్ని విద్య, ఉద్యోగాలు, సంస్థల జవాబుదారీతనం వంటి విస్తృత సమస్యలతో అనుసంధానించడం ద్వారా కుల, వర్గాలకు అతీతంగా యువతను ఏకం చేసే అవకాశం ఏర్పడుతోంది. అయితే ఈ ఉద్యమం ఎంత విస్తరిస్తుంది, ఎంతకాలం కొనసాగుతుందన్నదానిపైనే దాని రాజకీయ ప్రభావం ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

7. కలవరపెడుతున్న వీధి ఉద్యమాలు
1980–90 దశకాల్లో వీధి ఉద్యమాల ద్వారానే బీజేపీ తన రాజకీయ బలాన్ని పెంచుకుంది. అందుకే తన నియంత్రణలో లేని ప్రజా ఉద్యమాలు కొత్త నాయకత్వాన్ని, విస్తృత ఐక్యతను సృష్టించగలవని ఆ పార్టీకి తెలుసు. ప్రస్తుత నిరసనలతో వేర్వేరు వర్గాలు ఒకే వేదికపైకి వస్తే బీజేపీకి రాజకీయంగా ఇబ్బందులు పెరుగుతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నిరసనలను అణచివేయడం, విమర్శలను దేశ వ్యతిరేక చర్యలుగా చిత్రీకరించడం మోడీ ప్రభుత్వానికి మరింత నష్టం కలిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ‘అధికార మార్పు’ భయాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా బీజేపీ తన పాలనపై ప్రజల తీర్పు సాధ్యమేనని పరోక్షంగా అంగీకరిస్తోందని విశ్లేషిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అసంతృప్తికి సమాధానం బలప్రయోగం కాదనీ, జవాబుదారీతనం, చర్చ, సమస్యల పరిష్కారమే మార్గమని సూచిస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్